కరోనా : మాస్క్ లేకుంటే రూ.250.. ఆ సర్టిఫికెట్ లేకపోతే నో ఎంట్రీ !

corona tests crossed one crore in andhra pradesh

దేశవ్యాప్తంగా కరోనా మరోసారి విజృంభిస్తోంది. కోవిడ్-19 పాజిటివ్ కేసుల్లో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 62వేలకుపైగా కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి. అత్యధికంగా మహారాష్ట్రలో దాదాపు 37వేల మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ కాగా… తర్వాత కర్ణాటకలో 2,566 కేసులు బయటపడ్డాయి. నాలుగు నెలల తర్వాత ఇక్కడ అత్యధిక కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమయ్యింది.

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి తప్పనిసరిగా కోవిడ్-19 నెగెటివ్ సర్టిఫికెట్ ఉండాలని ఉత్తర్వులు జారీ చేసింది.బెంగళూరుకు వచ్చేవారికి ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు తప్పనిసరి చేసిన కర్ణాటక ప్రభుత్వం ఏప్రిల్‌ 1 నుంచి జరిమానాలూ వసూలు చేయాలని నిర్ణయించింది. ఏసీ హాళ్లు, దుకాణాల్లో భౌతికదూరం అమలు చేయని నిర్వాహకుల నుంచి రూ.5 వేలు, మాల్స్, స్టార్‌ హోటళ్లు, 500 మందికి మించి హాజరయ్యే వివాహ వేదికలు, ర్యాలీలు, బహిరంగ సభల నిర్వాహకుల నుంచి రూ.10 వేలు వసూలు చేయనున్నారు.

అలాగే మాస్క్ లేకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరిగితే నగరాల్లో రూ.250, గ్రామాల్లో రూ.100 జరిమానా విధించనున్నారు.ప్రస్తుతం మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, చత్తీస్‌గఢ్ నుంచి వచ్చే వ్యక్తులపై మాత్రమే ఆంక్షలు విధిస్తుండగా.. ఇకపై అన్ని రాష్ట్రాలవారికీ ఈ నిబంధనలు వర్తింపజేస్తున్నట్టు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. కోవిడ్-19 పాజిటివ్ వచ్చిన వ్యక్తులు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని, ఇక నుంచి వారి చేతులపై స్టాంప్ వేయనున్నట్టు ఆరోగ్య మంత్రి సుధాకర్ తెలిపారు.

అలాగే, కళ్యాణ మండపాల్లో వివాహాలు, వేడుకలకు 200 మించకూడదని, భారీ హాళ్లు, విశాలమైన ప్రాంగణాల్లో 500 దాటరాదని సూచించింది. భారీ జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలన్నారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలని, ఆస్పత్రిలో బెడ్‌లు, ఐసీయూల సమాచారాన్ని ఆన్‌లైన్‌‌లో ఉంచినట్టు మంత్రి తెలిపారు. మ్యుటెంట్ స్ట్రెయిన్ వ్యాప్తిలో ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. రాబోయే రెండు నెలలు మరింత జాగ్రత్తగా ఉండాలని అన్నారు.