Work Resumes In Amaravati : ఎట్టకేలకు అమరావతిలో ‘పని’ మళ్ళీ మొదలైందహో.!

Work Resumes In Amaravati : అమరావతి చుట్టూ అత్యంత నీఛమైన రాజకీయాలు జరిగాయి గడచిన మూడేళ్ళలో. ‘మేం అధికారంలోకి వస్తే అమరావతిని మరింతగా అభివృద్ధి చేస్తాం..’ అని చెప్పిన వైసీపీ, మూడేళ్ళుగా అమరావతిలో అభివృద్ధి పనుల్ని గాలికొదిలేసింది. న్యాయస్థానాలు వేసిన మొట్టికాయల ఫలితం కావొచ్చు, అమరావతికి భూములిచ్చిన రైతుల ఉద్యమ ఫలితం కావొచ్చు.. కారణం ఏదైతేనేం, అమరావతిలో దాదాపు మూడేళ్ళ తర్వాత తిరిగి అభివృద్ధి కార్యక్రమాలు జోరందుకున్నాయి.

ఆగిపోయిన పనులు పునఃప్రారంభమయ్యాయంతే. అందునా ఎమ్మెల్యే క్వార్టర్లు వంటివాటికి సంబంధించిన పనులు మాత్రమే పునఃప్రారంభమయ్యాయి. పనులు చేసేందుకు కార్మికులు రావడంతో అమరావతి కోసం భూములిచ్చిన రైతుల్లో కాస్త ఆనందం కనిపిస్తోంది. కార్మికులకు ఘన స్వాగతం పలికారు అమరావతి రైతులు.

అమరావతిని కమ్మరావతిగా, స్మశానంగా, ఎడారిగా, ముంపు ప్రాంతంగా.. ఇలా వైసీపీ నేతలు, పైగా మంత్రులు అభివర్ణించిన తీరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రాంతమన్న సోయ అధికార పార్టీలో లేకుండా పోయింది మూడేళ్ళపాటు.

సరే, వైసీపీ కొత్తగా మూడు రాజధానుల నినాదాన్ని భుజానికెత్తుకుని వుండొచ్చు. అందులో అమరావతి కూడా వున్నప్పుడు, ఆ అమరావతిలో పనులు కొనసాగించాలి కదా.? అమరావతిని శాసన రాజధాని అని ఓ వైపు చెబుతూ, ఇంకో వైపు అమరావతిని స్మశానంగా వైసీపీ ఎలా అభివర్ణించగలిగినట్టు.?

ఎలాగైతేనేం, వైసీపీ తన తప్పు తెలుసుకుని, అమరావతిని గుర్తించినందుకు అభినందించాల్సిందే. అయితే, పనులు పునఃప్రారంభమనేది కేవలం పబ్లిసిటీ స్టంట్ అయితే అంతకన్నా దారుణం ఇంకోటుండదు.