ఇక్కడ ఓ వైన్ షాప్‌కు రూ. ఐదు కోట్లో, పది కోట్లో పలికితే ఆశ్చర్యపోతాం. కానీ రాజస్థాన్‌లో ఓ వైన్‌షాప్ ఏకంగా రూ.510 కోట్లు పలికిందంటే నమ్ముతారా, అది కూడా రూ.72 లక్షల బేస్ ప్రైస్‌తో మొదలైన వేలం ఈ స్థాయికి చేరిందంటే నమ్మశక్యం కాదు. ఈ మధ్యే రాజస్థాన్ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చింది. దీని ప్రకారం వైన్‌షాప్‌లను లాటరీలో కాకుండా వేలం వేయాలని నిర్ణయించారు. ఇది అక్కడి ప్రభుత్వంపై కాసుల వర్షం కురిపించింది.
మద్యానికి ఎక్కడైనా మాంచి డిమాండ్ ఉంటుంది. అందుకే కొన్ని ప్రాంతాల్లో మద్యం షాపులకు వేలం వేస్తుంటారు. ఆ వేలంపాట ఒక్కోసారి ఐదారు కోట్ల రూపాయల వరకు వెళుతుంది. అయితే, రాజస్థాన్ లోని ఓ మద్యం షాపు వేలంలో వందల కోట్ల ధర పలకడం విశేషం అని చెప్పాలి. రాజస్థాన్ సర్కారు ఇటీవల కొత్త మద్యం పాలసీ తీసుకువచ్చింది. లాటరీ పద్ధతిలో వైన్ షాపులు కేటాయించే బదులు వేలం పద్ధతి పాటించాలని నిర్ణయించింది.
ఈ క్రమంలో హనుమాన్ గఢ్ జిల్లా నోహర్ లోని ఓ వైన్ షాపు కోసం వేలం నిర్వహించగా ఏకంగా రూ.510 కోట్లు పలికింది. ఈ వేలంపాట 15 గంటల పాటు నిర్వహించారంటే ఎంత హోరాహోరీగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. చివరికి కిరణ్ కన్వర్ అనే వ్యాపారి ఈ వైన్ షాపును కళ్లు చెదిరే ధరకు సొంతం చేసుకున్నాడు. ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే… గతంలో ఇదే వైన్ షాపు లాటరీ పద్ధతిలో కేవలం రూ.65 లక్షలకే అమ్ముడైంది. ఈసారి వేలంలో ప్రారంభ ధర రూ.72 లక్షలుగా నిర్ణయించగా, క్రమంగా పెరుగుతూ పోయింది. ఉదయం 11 గంటలకు మొదలైన ఈ ఈ-వేలం అర్ధరాత్రి 2 గంటలకు ముగిసింది. ఇంత భారీ బిడ్ ఎందుకు దాఖలైందా అని ఆరా తీస్తే.. అది రెండు కుటుంబాల మధ్య వైరం వల్లే అని తేలింది. ఈ వైన్ షాప్ కోసం ప్రియాంకా కన్వర్ అనే మరో మహిళ కూడా పోటీ పడింది. ఈ ఇద్దరూ పోటా పోటీగా వెళ్లడంతో చివరికి అది రికార్డు ధర పలికింది.