రాజస్థాన్ లో కలకలం… ఢిల్లీ శ్రద్దా కేసు మరవకముందే మరొకటి..?

ప్రస్తుత కాలంలో మహిళలకు రక్షణ కరువైంది. ఎక్కడ చూసినా మహిళల మీద లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. అరికట్టటానికి పోలీసులు ప్రభుత్వాలు ఎన్నో కఠిన చర్యలు చేపట్టినప్పటికీ మహిళల మీద దాడులు మాత్రం ఆగటం లేదు. ఇటీవల ఢిల్లీలో జరిగిన శ్రద్ధ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆ దారుణ సంఘటన ఇంకా మరువకముందే తాజాగా రాజస్థాన్ లో మరొక సంఘటన చోటు చేసుకుంది. రాజస్థాన్ కి చెందిన వ్యక్తి ప్రియురాలిని చంపి ఆ తర్వాత పోలీసులకు దొరక్కుండా ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి బావిలో విసిరేసిన ఘటన కలకలం రేపుతోంది.

వివరాలలోకి వెళితే…నాగౌర్ జిల్లా శ్రీ బాలాజీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాసర్ చెందిన ఒక వివాహిత మహిళ జనవరి 20న ఆమె అత్తమామల ఇంటికి వెళుతున్నానని చెప్పి పుట్టింటి నుంచి వెళ్లిపోయింది. కానీ, ఆ రోజు ఆమె తన అత్తమామల ఇంటికి చేరుకోలేదు. మహిళ కోసం ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబసభ్యులు పోలిసులకు ఫిర్యాదు చేశారు. మాల్వా రోడ్డు సమీపంలో మహిళ బట్టలు, తల వెంట్రుకలను గుర్తించారు పోలీసులు. ఆ తర్వాత మహిళ మృతదేహం ముక్కలు గుర్తించారు. బంధువుల రక్త నమూనాలను తీసుకొని మృతదేహం ముక్కలతో డీఎన్‌ఎ మ్యాచ్ చేశారు. వైద్య పరీక్షల్లో మృతదేహం ముక్కలు మహిళకు చెందినవని తేలింది.

అదృశ్యమైన మహిళ ఆచూకీ కోసం గాలిస్తుండగానే మహిళ ప్రేమికుడి గురించిన విషయం తెలిసింది. దాంతో అనుమానం వచ్చిన పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారించగా, అతడు నేరాన్ని అంగీకరించాడు. మహిళను హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని దాచేందుకు ముక్కలు ముక్కలుగా నరికినట్లు చెప్పాడు. అనంతరం దేర్వా గ్రామ సమీపంలోని బావిలో పడేసినట్లు నిందితుడి అంగీకరించాడు. దీంతో పోలీసులు అతని మీద హత్యా నేరం కింద కేసు నమోదు చేసుకుని రిమాండ్ కి తరలించారు. అసలు మహిళలు ఆ వ్యక్తి చంపటానికి గల కారణాల గురించి తెలుసుకునే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు.