YSRCP Join With BJP : బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నంలో వైసీపీ వుందా.?

YSRCP Join With BJP : ప్రత్యేక హోదా ఇచ్చినా ఇవ్వకున్నా బీజేపీతో కలిసి పని చేయడం తప్పనిసరయ్యేలా వుంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి. 2024 ఎన్నికల్లో వైసీపీతో బీజేపీ దోస్తీ దాదాపు ఖాయమేనని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికైతే బీజేపీ – జనసేన కలిసి ప్రయాణిస్తున్నాయి రాజకీయంగా. కానీ, మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో బీజేపీ, వైసీపీకి దగ్గరయ్యేందుకు అవకాశాలున్నాయి.

నిజానికి, వైసీపీ నుంచే పొత్తు చర్చలు బీజేపీ అధిష్టానంతో ప్రారంభమయ్యాయన్నది ఏపీ రాజకీయాల్లో ప్రముఖంగా వినిపిస్తోన్న ఓ గాసిప్. ఇది వైసీపీ నుంచి అందుతున్న లీకుగా కొందరు అభివర్ణిస్తున్నారు. కాదు కాదు, టీడీపీ – జనసేన బంధాన్ని తెగ్గొట్టేందుకు బీజేపీ చేస్తున్న లీక్.. అని ఇంకొందరు అంటున్నారు.

టీడీపీ – జనసేన కలిస్తే వైసీపీకి ఖచ్చితంగా నష్టం జరుగుతుంది. మరెందుకు వైసీపీ నేతలు టీడీపీ – జనసేన కలిసే వున్నాయని ప్రచారం చేస్తున్నట్టు.? తద్వారా జనసేన నుంచి బీజేపీని విడదీసి, ఆ బీజేపీతో తాము కలవాలన్నది వైసీపీ ఆలోచన అట.

‘మేం బీజేపీకి దూరమైతే, వైసీపీ దగ్గరవ్వాలనుకుంటోంది..’ అని గతంలో.. అంటే బీజేపీతో టీడీపీ అంటకాగుతున్న సమయంలో చంద్రబాబు చెబుతూ వచ్చారు. ఎప్పుడైతే టీడీపీ – బీజేపీ మధ్య వైరం పెరిగిందో, బీజేపీకి వైసీపీ తెరవెనుకాల దగ్గరయ్యింది. రాజకీయాల్లో ఇవన్నీ మామూలే.

‘మేం ఒంటరిగా వున్నాం..’ అని వైసీపీ చెబుతున్నా, తెరవెనుక వైసీపీ – బీజేపీ మధ్య ఎఫైర్ అయితే నడుస్తూనే వుంది. అది బీజేపీ మిత్రపక్షమైన జనసేనకి నచ్చడంలేదు. ఈ నేపథ్యంలో టీడీపీ – జనసేన ఒక్కటయ్యేందుకు మార్గం సుగమం అవుతున్నట్లు కనిపిస్తోంది.