మూడు రాజధానుల విషయమై వైఎస్ జగన్ సర్కార్ ఇప్పటికే మాట తప్పింది, మడమ తిప్పేసింది కూడా. గతంలో చేసిన చట్టంలో లొసుగులున్నాయన్న విషయాన్ని ప్రభుత్వమే అధికారికంగా అంగీకరించాల్సి వచ్చింది. అవి లొసుగులా.? న్యాయపరమైన చిక్కులకు ఆస్కారమిచ్చే చిన్న చిన్న లోపాలా.? అన్నది వేరే చర్చ.
మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకునే క్రమంలో, కొత్త బిల్లుతో త్వరలో మళ్ళీ వస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారుగానీ, ఆ దిశగా జగన్ సర్కార్ చిత్తశుద్ధితో ఆలోచన చేసే అవకాశమే లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజాగా అమరావతి పరిరక్షణ యాత్ర విషయమై వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహరించిన తీరు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. అమరావతి రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులగా వైసీపీ అభివర్ణిస్తోన్న విషయం విదితమే. మరి, ఆ రైతులు చేపట్టిన మహా పాదయాత్ర విషయమై వైసీపీ ఎమ్మెల్యే సానుభూతి ప్రకటించడమేంటి.?
‘మీ ఆలోచనలు వేరు. మా పార్టీ విధానం వేరు. అయినాసరే, మా జిల్లాకి వచ్చారు. మా నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. ఎమ్మెల్యేగా మీకు నా నుంచి ఏ సహాయ సహకారాలు కావాల్సినా అందిస్తాను. నాకు ఒక్క ఫోన్ చెయ్యండి, మీ సమస్య చిటికెలో పరిష్కారమవుతుంది..’ అంటూ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అమరావతి రైతులకు చెప్పడం గమనార్హం.
అలాగని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అమరావతికి మద్దతివ్వలేదు. రైతులు ఒత్తిడి తెచ్చినా, ‘జై అమరావతి’ అనేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు శ్రీధర్ రెడ్డి. అయితే, ఈ పరిణామం ద్వారా అమరావతి పట్ల తమ మారిన ధోరణిని వైసీపీ చెప్పకనే చెప్పిందనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. మరి, రాయలసీమకు చెందిన వైసీపీ నేతలూ ఇదే ధోరణి ప్రదర్శిస్తారా.? ప్రదర్శిస్తే మంచిదే.