Ys Jagan : వైఎస్ జగన్ హయాంలో పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేనా.?

Ys Jagan :ఎప్పుడో బ్రిటిష్ హయాంలో ప్రతిపాదించబడిన పోలవరం ప్రాజెక్టు నేటికీ అతీ గతీ లేకుండా వుందంటే, అందుకు బాధ్యత వహించాల్సిందెవరు.? ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడాల్లేవ్.. అందరూ పోలవరం ప్రాజెక్టుతో ఆటలాడారు, ఆడుతూనే వున్నారు. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ జీవనాడి. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి మాత్రం ఎవరికీ వుండడంలేదు.
వాస్తవానికి పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రం మీద వుంది. కానీ, రాష్ట్రం చేతుల్లో ప్రాజెక్టు పెట్టేసి, పైనుంచి కూర్చుని పెత్తనం చేస్తోంది కేంద్రం. చిత్రంగా రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలైన టీడీపీ, వైసీపీ.. ఆ ప్రాజెక్టుతో ఆటలాడుతున్నాయి. చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు. వైఎస్ జగన్ హయాంలో పూర్తయ్యేలా కనిపించడంలేదు.
‘వైఎస్ విగ్రహాన్ని ప్రాజెక్టు దగ్గర పెడతాం..’ అంటూ గతంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. కానీ, నిజానికి కావాల్సింది విగ్రహం కాదు. ఆ విగ్రహానికి పెట్టే ఖర్చుతో ఇంకేదైనా పెట్టొచ్చు. అది ప్రజా ధనం. ప్రజాధనాన్ని వ్యక్తుల విగ్రహాల కోసం ఖర్చు చేయడమేంటన్న కనీసపాటి ఇంగితాన్ని పాలకులు మర్చిపోతున్నారు.
పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందా.? లేదా.? అన్న సందేహాలు కొనసాగుతున్న వేళ ఈ విగ్రహ రాజకీయాలేంటి.? పైగా, కేంద్రమే ప్రాజెక్టుకి పూర్తిస్థాయిలో నిధులు ఇస్తున్నప్పుడు, కేంద్రమెలా వైఎస్ విగ్రహ ఏర్పాటుకు అంగీకరిస్తుంది.? అసలు ప్రాజెక్టు పట్ల ఎవరికీ చిత్తశుద్ధి లేకపోవడమే అన్ని సమస్యలకూ కారణం. సంక్షేమ పథకాలకి నిధులుంటాయ్.. పోలవరం ప్రాజెక్టుకి నిధులు కేటాయించలేని దుస్థితి రాష్ట్రానిది.
కేంద్రం కూడా అంతే. రాష్ట్రం సంక్షేమ పథకాల కోసం వేల కోట్లు, లక్షల కోట్లు ఖర్చు చేస్తూ ప్రాజెక్టుని నిర్మించుకోలేకపోతోందన్నట్టు వ్యవహరిస్తోంది. అన్నీ కలిసి పోలవరం ప్రాజెక్టుకి శాపంగా మారాయి. ఈ రాజకీయ రక్కసి నుంచి పోలవరం ప్రాజెక్టుని కాపాడేదెవరో ఏమో.!