టీఆర్ఎస్ పార్టీ.. 2014 నుంచి ఆరేళ్ల పాటు తెలంగాణను ఏలింది. తెలంగాణ అంటే టీఆర్ఎస్ పార్టీ.. టీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ అనే విధంగా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో పాతుకుపోయింది. కానీ.. ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం వచ్చేసింది. దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ అదే విషయం స్పష్టమైంది. దీంతో వెంటనే గులాబీ పార్టీ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది.
అందుకే.. త్వరలో జరగబోయే నాగార్జునసాగర్ ఉపఎన్నికలో ఎలాగైనా గెలవాలని టీఆర్ఎస్ పార్టీ తెగ ప్రయత్నాలు చేస్తోంది. అందుకే ఇప్పటి నుంచే సాగర్ ఉపఎన్నికపై దృష్టి సారించింది. ఇంకా సాగర్ ఉపఎన్నిక నోటిఫికేషన్ కూడా వెలువడలేదు కానీ.. అప్పటికే నాగార్జునసాగర్ లో టీఆర్ఎస్ నేతలు ప్రచారం ప్రారంభించారు. టీఆర్ఎస్ నేతలు అక్కడ మకాం వేశారు. వ్యూహ రచన చేస్తున్నారు. సాగర్ ప్రజల నాడిని తెలుసుకుంటున్నారు. ఎవరిని బరిలోకి దింపితే మళ్లీ సాగర్ లో గెలిచే అవకాశం ఉందో బేరీజు వేసుకుంటున్నారు.
సూర్యాపేటకు చెందిన మంత్రి జగదీశ్ రెడ్డికి నాగార్జున సాగర్ ఉపఎన్నిక బాధ్యతను సీఎం కేసీఆర్ అప్పగించారు. దీంతో ఆయన ఇప్పటికే రంగంలోకి దిగారు. ఆయనతో పాటు కర్నె ప్రభాకర్, మారెడ్డి శ్రీనివాసరెడ్డి, రవీంద్రరావు లాంటి నల్గొండ జిల్లా టీఆర్ఎస్ నేతలంతా నాగార్జునసాగర్ లో పర్యటిస్తూ ప్రస్తుత పరిస్థితిని అంచనా వేస్తున్నారు.
అలాగే.. సీఎం కేసీఆర్ కూడా త్వరలోనే నాగార్జునసాగర్ లో పర్యటించనున్నారట. నాగార్జున సాగర్ టీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారట. ఉపఎన్నికలో అమలు చేయాల్సిన వ్యూహంపై నేతలతో కేసీఆర్ చర్చించనున్నారట. ఇంతలా ప్లాన్ చేస్తున్నారంటే.. ఖచ్చితంగా ఈసారి కూడా నాగార్జునసాగర్ లో టీఆర్ఎస్ జెండా ఎగరాల్సిందే. చూద్దాం.. ఏమౌతుందో?