తెలంగాణలో బీజేపీ పార్టీ దూకుడు మంత్రాన్ని జపిస్తున్న విషయం అందరికి తెలిసిందే, తాజాగా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఇంటిపై బీజేపీ కార్యకర్తలు నిర్భయంగా వచ్చి దాడులు చేసేశారు. అయోధ్య రామాలయం కోసం భారతీయ జనతా పార్టీ నేతలు వసూలు చేస్తున్న విరాళాలపై లెక్కలు చెప్పాలంటూ… పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఉద్రిక్తతకు కారణం అయ్యాయి. అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. హన్మకొండలోని ఆయన ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడులకు దిగారు. పెద్ద ఎత్తున ధర్మారెడ్డి ఇంటికి రాళ్లు, కోడి గుడ్లతో వచ్చిన కార్యకర్తలు.. పోలీసులు అడ్డుకుంటున్నా రాళ్లు, కోడి గుడ్లు విసిరారు. రాళ్ల దాడిలో అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇంటి ఆవరణలో కుర్చీలను కూడా బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఓ పోలీసు అధికారికి గాయాలయ్యాయి.
ఈ దాడిపై తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందిస్తూ భౌతిక దాడులు చేయాలని టీఆర్ఎస్ అనుకుంటే.. బీజేపీ నేతలు తట్టుకోలేరని హెచ్చరించారు. గతంలో కోరుట్లఎమ్మెల్యే విషయంలోనూ అదే జరిగింది. ఇప్పుడు ధర్మారెడ్డి విషయంలోనూ అదే జరిగింది. ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి.. చట్ట విరుద్ధమైతే న్యాయపరమైనచర్యలు తీసుకోవాలని కానీ చట్టాన్నిచేతుల్లోకి తీసుకుని ఇళ్లపై దాడికి పాల్పడటం దుందుడుకు చర్యే. ఇలాంటివి రాజకీయాలను దారి తప్పేలా చేస్తున్నాయి. దాడుల వరకూ వెళ్లిపోతున్నాయి.
రాష్ట్రంలో తెరాస పార్టీ అధికారంలో ఉన్నకాని పార్టీ ఎమ్మెల్యేల మీద దాడులు జరుగుతున్నాయి అంటే అది తెరాస యొక్క మెతకతనమే అని ఆ పార్టీ నేతలే చెపుతున్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ బీజేపీ లోకి లొంగిపోయిందనే మాటలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి, అందుకే ఈ రకమైన దాడులు జరుగుతున్నాయని తెరాస నేతలు వాపోతున్నారు.
ఇక పరకాల ధర్మారెడ్డి ఇంటిపై దాడి జరిగిన అనంతరం వరంగల్ కు చెందిన కీలక నేతలందరూ ధర్మారెడ్డికి ఇంటికి వెళ్లటం జరిగింది. తాము ప్రతి దాడులు చేయాలనుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలని బీజేపీ నేతలను తెరాస నేతలు హెచ్చరించారు. అదే రోజు వరంగల్ లోని కొందరు బీజేపీ నేతల ఇళ్లపై కూడా రాళ్ల దాడి జరగటం, కొందరి ఇళ్లను జేసీపీ లతో పడకొట్టటానికి ప్రయత్నాలు కూడా జరిగినట్లు తెలుస్తుంది.