వైఎస్ షర్మిల తెలంగాణ లో సరికొత్త పార్టీ పెట్టటానికి సిద్దమైనట్లు సృష్టంగా తెలుస్తుంది. ఇప్పటికే తెలంగాణ లోని ఒక్కో ఉమ్మడి జిల్లా నేతలతో ప్రత్యేకంగా సమావేశం అవుతుంది. అయితే షర్మిల పార్టీ పెట్టటం వెనుక ఎవరి హస్తం ఉంది అనేది ఎవరికీ అర్ధం కానీ విషయం. కొందరేమో బీజేపీ ఆడిస్తున్న గేమ్ అని, మరికొందరేమో కేసీఆర్ కు రక్షణగా కేవీపీ, జగన్ కలిసి ఆమెతో పార్టీ పెట్టిస్తున్నారని, ఇంకొందరేమో వైసీపీ పార్టీలో షర్మిలకు జగన్ సరైన గౌరవం ఇవ్వలేదు అందుకే ఆమె కొత్త పార్టీ పెడుతుంది అంటూ మాట్లాడుతున్నారు.
సాధారణంగా ఒక కొత్త పార్టీ వస్తున్నప్పుడు ఇలాంటివి సహజమే, ఎవరు పార్టీ పెట్టిన వాళ్ళ అంతిమ లక్ష్యం అధికారమే, అంతేతప్ప ఒకరికి మేలు చేద్దాం, ఒకరికి సేవ చేద్దామని కాదు. మొదటి నుండి దేశంలో మహిళా రాజకీయ నేతలు చాలా తక్కువ, ముఖ్యంగా దక్షిణ భారతదేశం లో మహిళా నేత అంటే గుర్తువచ్చే పేరు జయలలిత, తమిళనాడు రాజకీయాలను ఎక్కువగా ప్రభావితం చేసిన నాయకురాలు, ఆమె కంటే ముందు ఇందిరాగాంధీ పేరు ఎక్కువగా వినిపించేది. షీలా దీక్షిత్, మాయావతి లాంటి నాయకురాళ్లు ఉన్న కానీ వాళ్ళ ప్రభావం తక్కువే అని చెప్పాలి.
ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ఒక్క మమతా బెనర్జీ మాత్రమే చెప్పుకోదగిన మహిళా నాయకురాలు, ఇక సౌత్ నుండి ఎవరు కూడా కనిపించటం లేదు ఇలాంటి తరుణంలో షర్మిల కొత్తపార్టీ పెట్టటం అనేది గొప్ప విశేషమే అని చెప్పాలి. ఆమె రాజకీయ పార్టీ పెట్టబోతోంది అనే విషయం తెలిసిన దగ్గర నుండి సౌత్ లోని మీడియాలో ఆమె గురించి వార్తలు రావటం గమనించాలి. (సాక్షిలో రాలేదు అనుకోండి). మహిళాల తరుపున నుండి సరైన నాయకత్వం లేని ఈ తరుణంలో “మహిళా సాధికారత” అనే స్లోగన్ ను ప్రధానంగా తెర మీదకు తీసుకోని వస్తే ఖచ్చితంగా షర్మిల విజయవంతం కావటం ఖాయం.
తెలంగాణలోని వైఎస్సార్ అభిమానుల ఓట్లు షర్మిలమ్మ పార్టీకి అతి పెద్దబలమనే విషయం అందరికీ తెలిసిందే. సామాజికవర్గ, మైనారిటీల సమీకరణాల ద్వారా ఆ పార్టీకి పఠిష్టమైన ఓటు బ్యాంకు ఏర్పడుతుందని కొందరు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వీటితో పాటు ‘మహిళా సాధికారతే లక్ష్యం’గా షర్మిలమ్మ కానీ వారి పార్టీని జనంలోకి బలంగా తీసుకెళ్ళగలిగితే మహిళా ఓటర్లను తనవైపు తిప్పుకునేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది… కొందరు అనుకోవచ్చు అసలు ఆమె పార్టీనే పెట్టలేదు, ఇప్పుడే ఎన్నికల ప్రణాళికలా.. ? అని మనం పైన చెప్పుకున్నట్లు రాజకీయాల్లోకి ఎవరొచ్చినా అధికారం కోసమే !