వైఎస్ షర్మిల పార్టీకి ‘పీకే’ వ్యూహాలు ఊపునిస్తాయా.?

ప్రశాంత్ కిషోర్.. దేశ రాజకీయాల్లో ‘వ్యూహకర్త’గా ఆయనకున్న పేరు గురించి కొత్తగా చెప్పేదేముంది.? ఏ రాష్ట్రంలో ఏ పార్టీతో ప్రశాంత్ కిషోర్ జతకడితే, ఆ రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి రావాల్సిందే. ఈ క్రమంలో ప్రశాంత్ కిషోర్ ఎలాంటి వ్యూహాలు రచిస్తాడో అందరికీ తెలిసిందే. ఓ గాయం, ఓ సెంటిమెంట్.. ఇలాంటివన్నీ ప్రశాంత్ కిషోర్ వ్యూహాల స్క్రిప్టులో కనిపిస్తాయి. దాదాపుగా అన్ని చోట్లా ఒకే రకమైన వ్యూహాన్ని అమలు చేస్తుంటాడాయన. ఇప్పుడు తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ.. అదేనండీ వైఎస్సార్ తెలంగాణ పార్టీకి ఆయన పని చేయబోతున్నారట. డైరెక్టుగా ఆయన రంగంలోకి దిగరుగానీ, ఆయన శిష్యులు ఇప్పటికే రంగంలోకి దిగేశారట. షర్మిల మాత్రం, ప్రశాంత్ కిషోర్‌తో ఇటీవల భేటీ అయ్యారనే ప్రచారం జరుగుతోంది.

ఇంకో రెండేళ్ళలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయ్. అంటే, ఇప్పటి నుంచే షర్మిల తన రాజకీయ వ్యూహాలకు పదును పెట్టాలన్నమాట.. అధికార పీఠం దక్కించుకోవాలంటే. కానీ, ఇంకా పూర్తిస్థాయిలో పార్టీ నిర్మాణమే జరగలేదు. పైగా, చెప్పుకోదగ్గ నేతలెవరూ షర్మిల పార్టీకి లేరు. వున్న ఆ కొద్ది మంది నేతలు కూడా ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో వేరే పార్టీల్లోకి దూకేశారు. మరి, ప్రశాంత్ కిషోర్ కావొచ్చు.. ఆయన శిష్యులు కావొచ్చు.. ఎలా షర్మిల పార్టీకి ఊపు తెస్తారు.? అసలంటూ వైఎస్ షర్మిలకి తెలంగాణ రాజకీయాలపై అంత చిత్తశుద్ధి వుందా.? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇంతవరకు ప్రశాంత్ కిషోర్, షర్మిల పార్టీ గురించి ఎక్కడా మాట్లాడలేదు. షర్మిల పార్టీ కూడా, ప్రశాంత్ కిషోర్ గురించి మాట్లాడింది లేదు. అయితే, 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సహకరించినట్లే, వైఎస్ షర్మిలకీ ప్రశాంత్ కిషోర్ సహకరిస్తారనీ, మొత్తంగా ఇదంతా వైఎస్ జగన్ కనుసన్నల్లోనే జరుగుతోందనీ రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.