మోడీకి వ్యతిరేకంగా కేసీయార్, జగన్ చేతులు కలపగలరా.?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున పెట్రో ధరల విషయమై అధికారిక ప్రకటన.. అదీ పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటన రూపంలో వచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ అయితే ఏకంగా మీడియా ముందుకొచ్చి కేంద్రాన్ని ఏకిపారేశారు. ఒకరు సుతిమెత్తగా, ఇంకొకరు చాలా బలంగా తమ వాదనల్ని వినిపించారు.

దేశంలో తెలుగు రాష్ట్రాల్లోనే పెట్రో ధరలు మండిపోతున్నాయంటూ బీజేపీ కొత్త పల్లవిని అందుకోవడంతో, వాస్తవాల్ని ప్రజలకు వివరించాలన్న ఉద్దేశ్యంతో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కీలక నిర్ణయం తీసుకన్నట్లే కనిపిస్తోంది. ఇరువురూ విడివిడిగా స్పందించారు.. మరి, కలిసి ఎప్పుడు బీజేపీపై పోరుబాటను ఖరారు చేస్తారు.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా, సందర్భానుసారం కేంద్రానికి పూర్తిస్థాయిలో తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీలు సహకరిస్తున్నాయి. బీజేపీతో రాజకీయ వైరం ఓ వైపు, అదే బీజేపీతో తెరవెనుకాల సఖ్యత ఇంకో వైపు.. ఇదీ బీజేపీ, వైసీపీ, టీఆర్ఎస్ నడుపుతున్న చిత్ర విచిత్రమైన రాజకీయం.

ఇప్పుడిక ముసుగులో గుద్దులాటకు ఛాన్సే లేదు. అటు వైఎస్ జగన్, ఇటు కేసీయార్.. ఇద్దరూ బీజేపీతో తాడోపేడో తేల్చుకోవడానికే సిద్ధమయ్యారని అనుకోవాలేమో.

పెట్రో ధరల వ్యవహారమొక్కటే కాదు, తెలుగు రాష్ట్రాల విషయంలో కేంద్రం చిన్నచూపు చూడటం చాలా విషయాల్లో జరుగుతోంది. అయినా, అటు జగన్ సర్కార్, ఇటు కేసీయార్ సర్కార్.. కేంద్రంలో మోడీ సర్కారుకి సహకరిస్తూనే వున్నారు. అయినాగానీ, తెలుగు రాష్ట్రాల్ని కేంద్రం పట్టించుకోవడంలేదు.

ఈ నేపథ్యంలో కేసీయార్, జగన్ చేతులు కలిపితే, తెలుగు రాష్ట్రాలకి ఖచ్చితంగా న్యాయం జరిగే తీరుతుంది.