ఒంటరి పోరు వైపు మొగ్గు చూపుతున్న జనసేనాని.?

Janasena

‘ప్రస్తుతానికైతే భారతీయ జనతా పార్టీతో పొత్తులో వున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రమే పొత్తులపై ఏ నిర్ణయమైనా తీసుకుంటారు. అది పార్టీలో అందరూ ఆమోదించేదిగానే వుంటుంది. అయినా, ఎన్నికల పొత్తుల గురించి ఇప్పుడే మాట్లాడటం తొందరపాటు అవుతుంది..’ అంటూ జనసేన ముఖ్య నేత, మెగా బ్రదర్ నాగబాబు పదే పదే చెబుతున్నా, ‘టీడీపీతో పొత్తు పెట్టుకుంటారా.? లేదా.?’ అన్న ప్రశ్న అయితే ఆయనకు ఎదురవుతూనే వుంది.

కాగా, రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయిలో పార్టీ పరిస్థితిపై నివేదికలు తెప్పించుకుంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోరు అయితే ఎలా వుంటుంది.? అన్న దిశగా సమాలోచనలు చేస్తున్నారన్నది తాజాగా అందుతోన్న అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.

‘వైసీపీ ఎలాగూ ముచ్చట పడుతోంది కదా.? ఒంటరిగా వెళ్ళి సత్తా చూపిద్దాం.!’ అంటూ కొందరు జనసేన నేతలు, కింది స్థాయిలో ఉత్సాహం ప్రదర్శించడమే కాదు, అదే విషయాన్ని అధినేత దృష్టికి తీసుకెళుతున్నారు కూడా. బీజేపీతో జనసేన కలిస్తే, బీజేపీకే లాభం. టీడీపీతో జనసేన కలిస్తే, టీడీపీకే లాభం. ఏ పార్టీతో కలిస్తే ఆ పార్టీకి లాభమైనప్పుడు.. ఆయా పార్టీలకు లాభం చేకూర్చడమే పనిగా పెట్టుకుంటే ఎలా.? అన్న చర్చ జనసైనికుల్లో అయితే జరుగుతోంది.

కానీ, రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఒక్కోసారి ఒక్కోలా మారతాయి. పైగా, 2019 ఎన్నికల్లో జనసేనకు వచ్చిన ఓటు బ్యాంకు చాలా తక్కువ. సీట్ల విషయానికొస్తే.. ఒకే ఒక్కటి. ఈ నేపథ్యంలో డబుల్ డిజిట్ సీట్లు సాధించాలంటే, ఓటు బ్యాంకు పెంచుకోవాలంటే టీడీపీతోనో, బీజేపీతోనో.. వీలైతే రెండిటితోనో కలిసి ఎన్నికలకు వెళ్ళడం తప్పనిసరి.