ఏపీ పేకాట హబ్ గా మారుతుందా..? అధికార నేతల హస్తమెంత..?

ap cm jagan

 ఆంధ్రప్రదేశ్ ను ప్రగతి మార్గంలో పరుగులు పెట్టించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఒక పక్క తీవ్రంగా కష్టపడుతుంటే, మరోపక్క అధికారిక పార్టీ నేతలు మాత్రం ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకోని వచ్చే కార్యక్రమాలు చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతున్నారు. ముఖ్యంగా పేకాట క్లబ్ లు నడిపిస్తూ వైసీపీ ఎమ్మెల్యే అనుచరులు పట్టుబడటం ఆంధ్రప్రదేశ్ సంచలనాలకు కారణం అవుతుంది. దీనికి రాష్ట్ర పోలీసులు కూడా సహకారం అందిస్తున్నారనే ఆరోపణలు రావటం విస్మయం కలిగించే విషయం.

SriDevi Mla

 స్వయంగా మంత్రి గుమ్మనూరు జయరాం స్వగ్రామంలో అంతర్రాష్ట్ర పేకాట శిబిరాన్ని పోలీసులు పట్టుకున్నప్పుడు రాష్ట్రం అంతా నివ్వెరపోయింది. పోలీసులకు తెలియకుండా అంత పెద్ద శిబిరం నిర్వహించడం సాధ్యం కాదు. ఎక్కడో తేడా వచ్చి శిబిరాన్ని పోలీసులు మూయించారనేది టీడీపీ నేతల వాదన. అలాంటి శిబిరాలు ఒక్క మంత్రి స్వగ్రామంలో కాదని.. పలుకుబడి ఉన్న ప్రతీ వైసీపీ నేత కూడా.. తమ తమ ప్రాంతంలో ఈ శిబిరాలను నిర్వహిస్తూ.. చిన్నపాటి క్లబ్బుల మాదిరిగా చేసుకుని దందా చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

 తాజాగా తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి విషయం రాష్ట్రంలో మరో సంచలనానికి కేంద్ర బిందువు అయ్యింది. రెయిన్ ట్రీ పార్క్‌లో నిర్వహిస్తున్న పేకాట క్లబ్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఆ శిబిరాన్ని నిర్వహిస్తోంది తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవినేనని ఆరోపణలు వెల్లువెత్తాయి. పట్టుబడిన వారు శ్రీదేవికి అనుచరులు కావడమే దీనికి కారణం. అయితే వారితో తనకు సంబంధం లేదని.. వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయించి నిరూపించుకున్నారు. దీనితో పార్టీ నుండి సస్పెండ్ అయ్యిన ఆ ఇద్దరు ఇప్పుడు శ్రీదేవి యొక్క అసలు గుట్టు బయటపెడుతూ, ఆమె పేకాట ఆడిద్దామని .. చెబుతున్న ఆడియోలను… నిందితులిద్దరూ విడుదల చేస్తున్నారు. దాంతో వైసీపీ వ్యవహారం బట్టబయలైపోయింది.

 మహిళా ఎమ్మెల్యేనే పేకాట శిబిరాల ద్వారా డబ్బులు సంపాదించాలనుకుంటే ఇక మిగిలిన నేతలు పరిస్థితి ఏంటి ..? వాళ్ళు ఇంకెన్ని అసాంఘిక కార్యకలాపాలకు తెరలేపుతారు అనే వాదన ఇప్పుడు ఏపీ వ్యాపంగా వినిపిస్తుంది. గతంలో టీడీపీ పరిపాలన సమయంలో విజయవాడ లో వెలుగు చూసిన కాల్ మనీ ఎంత సంచలనం అయ్యిందో, అంతకు మించి ఇప్పుడు పేకాట క్లబ్ ల విషయం దుమారం రేపుతోంది. ఇప్పటికి ఈ రెండు సంఘటనలే బయటపడ్డాయి, ఇక బయటకు రాని విషయాలు లోపల ఇంకెన్ని ఉన్నాయో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి, కాబట్టి ఇలాంటి వాటిపై సీఎం జగన్ కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే అది పార్టీకి తీవ్ర నష్టం కలిగించే అవకాశం లేకపోలేదు.