నిజంగానే అమరావతికి లక్ష కోట్లు ఖర్చవుతుందా.?

తెలుగునాట రాజకీయాల్లో ఎక్కడ విన్నా అమరావతి గురించిన చర్చే జరుగుతోంది. మూడు రాజధానులకు అనుకూలంగా గతంలో చట్టం తీసుకొచ్చిన వైఎస్ జగన్ సర్కార్, దాన్ని ఉపసంహరించుకోవడమే అందుకు కారణం. అయితే, అలాంటిదే కొత్త చట్టం తీసుకొస్తాం తప్ప, మూడు రాజధానుల ఆలోచన నుంచి వెనక్కి తగ్గేది లేదని వైఎస్ జగన్ ప్రభుత్వం స్పష్టతినిచ్చేసింది.

అయితే, అమరావతి విషయంలో గతంలో వినిపించిన ‘అవినీతి, భూ కుంభకోణం’ ఆరోపణలు తెరమరుగైపోయి, కొత్తగా లక్ష కోట్ల ఖర్చు.. అనే వాదన తెరపైకొచ్చింది. అసలు అమరావతికి నిజంగానే లక్ష కోట్లు ఖర్చవుతుందా.? అంటే, 50 వేల ఎకరాలు.. ఎకరానికి రెండు కోట్ల ఖర్చు.. వెరసి లక్ష కోట్ల ఖర్చు.. అన్నది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా చెప్పిన లెక్క.

సుమారు 30 వేల ఎకరాల భూమిని అమరావతి కోసం రైతుల నుంచి అప్పటి చంద్రబాబు ప్రభుత్వం సేకరించింది. దానికి అదనంగా ప్రభుత్వ భూమి కలుపుకుంటే సుమారు 50 వేల ఎకరాలు. అయితే, మొత్తం భూమి అంతటికీ ఒకేలా ఖర్చు చేయాల్సిన అవసరం వుండకపోవచ్చు.

ఎలా చూసినా, లక్ష కోట్ల లెక్క అనేది అసందర్భమిక్కడ. ఎందుకంటే, రివర్స్ టెండరింగ్ ద్వారా ఖర్చు తగ్గించే అవకాశం వుందని పలు ప్రాజెక్టుల విషయంలో వైఎస్ జగన్ ప్రభుత్వం నిరూపించింది. సో, లక్ష కోట్ల సాకు అనేది అర్థం పర్థం లేనిది.

నో డౌట్, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి బాగోలేదు గనుక, కొత్త రాజధాని నిర్మాణానికి ఆర్థిక వెసులుబాటు వుండదు. అయితే, వున్న ఆ కొద్దిపాటి సౌకర్యాల్ని కాస్త మెరుగుపరచుకుంటే, తక్కువ మొత్తంలో ఖర్చు చేయగలిగితే అమరావతి ఓ చిన్న పట్టణంగా అయినా రూపొందుతుంది. దాన్నే కొంత కాలం పాటు రాజధానిగా చూపొచ్చు. ఈ లాజిక్ వైఎస్ జగన్ సర్కార్ ఎలా మిస్సవుతోందో ఏమో.!