శాసన మండలిలో అధికార వైసీపీకి సంపూర్ణ బలం రాబోతోంది. కొత్తగా పలువురికి శాసన మండలి అవకాశం కల్పిస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అయితే, శాసన మండలిని రద్దు చేసే దిశగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం కూడా జరిగిపోయింది.
శాసన మండలిని ఖర్చు దండగ వ్యవహారంగా గతంలో అసెంబ్లీ సాక్షిగా అభివర్ణించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఇప్పుడెలా శాసన మండలికి పార్టీకి చెందిన నేతల్ని ప్రతిపాదిస్తున్నారట.? ఈ విషయమై సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతోంది.
‘శాసన మండలి అంటే రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రం.. దీన్ని పెద్దల సభ అని పిలుస్తాంగానీ, ఆ పెద్దల సభకు వుండాల్సిన హుందాతనం ఎప్పుడో పోయింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, శాసన మండలి రద్దు విషయంలో మంచి నిర్ణయమే తీసుకున్నా దానికి కట్టుబడి వుండలేకపోతున్నారు..’ అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
నిజానికి, శాసన మండలి రద్దు అవుతుందన్న కోణంలోనే, గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. మంత్రి వర్గంలో శాసన మండలి సభ్యులు లేకుండా చేయడం ద్వారా. మరిప్పుడు, కొత్తగా శాసన మండలికి పలువురి పేర్లను ప్రతిపాదించడమేంటి.?
అంటే, ముందు ముందు మంత్రి వర్గ విస్తరణ జరిగితే, శాసన మండలి సభ్యులు కూడా మంత్రి పదవుల కోసం పోటీ పడొచ్చన్నమాట. అదే జరిగితే మాత్రం, వైసీపీలో కొంత అలజడి రేగొచ్చు. కానీ, ఆ అవకాశం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇస్తారా.? అన్నదే అసలు చర్చ.