ఏపీలోని మహిళల ఖాతాల్లోకి త్వరలోనే డబ్బులు జమచేయనుంది జగన్ ప్రభుత్వం. పిల్లలను కాలేజీలకు పంపించే తల్లుల ఖాతాల్లో జగనన్న విద్యా దీవెన డబ్బులు జమకానున్నాయి. ఇందుకు సీఎం వైఎస్ జగన్ ముహూర్తం ఖరారు చేశారు. జగనన్న విద్యాదీవెనపై గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి ఆదిమూలపు సురేష్‌తో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఏప్రిల్ 9న జగనన్న విద్యాదీవెన కింద ఫీజు రీఎంబర్స్‌మెంట్ ఇవ్వాలని చెప్పారు సీఎం వైఎస్ జగన్.
ఏప్రిల్ 27న వసతిదీవెన డబ్బులు జమచేయాలని సూచించారు. ఆయా రోజుల్లో ఈ ఏడాదికి సంబంధించి తల్లుల ఖాతాల్లో జగనన్న విద్యా దీవెన, వసతి డబ్బులు జమ చేయనున్నారు. ఈ పథకాల ద్వారా దాదాపు 10 లక్షల మందికిపైగా విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.
నవరత్నాలులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. పేద విద్యార్థులకు ఉన్నత విద్యను సులభంగా అందించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కాలేజీలకు కాకుండా నేరుగా తల్లుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుంది.
నాలుగు త్రైమాసికాలకు డబ్బు ఇస్తారు. విద్యార్థుల తల్లిదండ్రులు కాలేజీకి వెళ్లి సంబంధిత ఫీజు కట్టాల్సి ఉంటుంది. తల్లిదండ్రులే నేరుగా ఫీజులు నేరుగా చెల్లించడం వలన కాలేజీల్లో విద్యాబోధన, సౌకర్యాలు, ఇతర వసతుల గురించి తెలుసుకునేందుకు వీలు పడుతుంది. ఏవైనా ఇబ్బందులు ఉంటే పరిష్కారం అధికారులు దృష్టికి తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో అర్హులైన విద్యార్థులందరికీ అన్ని కోర్సులకు విద్యా దీవెన కింద ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తుంది. అలాగే వసతి దీవెన పథకం కింద వసతి, భోజన ఖర్చులను ఆర్ధిక సాయం చేస్తుంది. విద్యా దీవెన కింద ఆయా కోర్సులకు చెల్లించాల్సిన ఫీజులను బట్టి ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుంది. అలాగే వసతి దీవెన పథకం కింద ప్రతి విద్యాసంవత్సరానికి అయ్యే వసతి, భోజన ఖర్చుల కోసం రూ.20వేలు ఇస్తారు. పాలిటెక్నిక్ కోర్సు చేస్తున్నవారికి రూ.15వేలు, ఐటీఐ కోర్సు చేస్తున్న వారికి రూ.10వేలు ఇస్తారు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్, కరస్పాండెన్స్ కోర్సులు చదివే విద్యార్థులు, మేనేజ్‌మెంట్, ఎన్‌ఆర్‌ఐ కోటా విద్యార్థులకు ఈ స్కీమ్ వర్తించదు.