కొత్త ఎస్‌ఈసీగా నీలం సాహ్ని … ఏపీ చరిత్రలో అరుదైన రికార్డు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) గా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముఖ్య సలహాదారు, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ శుక్రవారం ఆమె పేరును ఆమోదించారు. ఈ నెల 31వ తేదీతో ప్రస్తుత ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త ఎస్‌ఈసీ ఎంపిక కోసం ముగ్గురు పేర్లతో కూడిన ఫైల్‌ను జగన్ ప్రభుత్వం గవర్నర్‌కు పంపినట్లు తెలుస్తోంది.

Samayam Telugu | Telugu Rajyam

నీలం సాహ్నితో పాటు రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారులు శామ్యూల్‌, ప్రేమచంద్రారెడ్డి పేర్లను ప్రభుత్వం ప్రతిపాదించినట్లు తెలిసింది. వీరిలో ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామకానికి గవర్నర్ ఆమోదం తెలిపారు. కాగా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కొద్ది కాలానికే సీఎస్‌గా ఎల్వీ సుబ్రహ్మణ్యంను తప్పించి, నీలం సాహ్నికి బాధ్యతలు అప్పగించారు. దాదాపు ఏడెనిమిది నెలల ముందే నీలం సాహ్ని రిటైర్డ్ కావాల్సి ఉన్నా, కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసి మరీ ఆమె పదవిలో ఉండేలా సీఎం జగన్ చర్యలు తీసుకున్నారు.

ఇటీవలే నీలం సాహ్ని పదవీ విరమణ చేయగా, ముఖ్య సలహాదారుగా సీఎం జగన్ నియమించుకున్నారు. ఈ తరుణంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వంటి కీలక పదవిని నీలం సాహ్నిని ఎంపిక చేయడం గమనార్హం. కాగా, విభజిత ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని బాధ్యతలు చేపట్టారు. తాజాగా, ఏపీలో మొదటి మహిళా ఎన్నికల కమిషనర్‌గా కూడా నీలం సాహ్ని నియమితులు కావడం విశేషం. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రెండు కీలక పదవులు చేపట్టిన మహిళగా నీలం సాహ్ని పేరు శాశ్వతంగా నిలిచిపోనుంది. నీలం సాహ్ని 1984 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి కావడం గమనార్హం. ఉమ్మడి ఏపీలో మచిలీపట్నం అసిస్టెంట్ కలెక్టర్‌గా ఆమె సేవలందించారు. నల్గొండ జాయింట్ కలెక్టర్‌గా, కలెక్టర్‌గా పనిచేశారు. టెక్కలి సబ్ కలెక్టర్‌గా కూడా సేవలందించారు. విభజిత ఏపీలో రెండు కీలక పదవులు చేపట్టిన మహిళగా నీలం సాహ్ని చరిత్ర సృష్టించారు.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles