జనసేనకు అల్లు అర్జున్ మద్దతు కొనసాగుతుందా.?

జనసేన పార్టీతో మెగా కుటుంబం వుంటుందా.? లేదా.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. మెగాస్టార్ చిరంజీవి అయితే ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. కానీ, జనసేన పార్టీకి నష్టం కలిగించేలా ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్ని సమర్థించారు. దాంతో, పవన్ కళ్యాణ్ అభిమానులు ఒకింత నొచ్చుకున్నారు చిరంజీవి తీరుతో.

అయితే, చిరంజీవి పెద్దరికం వేరు.. ఆయన ఆలోచనలు వేరు. తమ్ముడు పవన్ కళ్యాణ్‌కి అవసరమైన మేర తన మద్దతు ఎప్పుడూ వుంటుందని చిరంజీవి చెబుతుంటారు. ‘రాజకీయ ఆలోచనల పరంగా మా ఇద్దరి దారులు వేరు.. కానీ, గమ్యం ఒకటే..’ అని చిరంజీవి చాలా సందర్భాల్లో చెప్పారు.

చిరంజీవి సంగతి పక్కన పెడితే, అల్లు అర్జున్ గతంలో ‘చెప్పను బ్రదర్..’ అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులతో పంచాయితీ పెట్టుకున్నారు. ఆ తర్వాతి నుంచీ పవన్ – అల్లు అర్జున్ అభిమానుల మధ్య గొడవ కొనసాగుతూనే వుంది. అయితే, 2019 ఎన్నికలకు ముందు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తో కలిసి ఓ రాజకీయ వేదికను పంచుకున్నాడు అల్లు అర్జున్.

అక్కడితో ఆ వివాదానికి ముగింపు పడినా, పవన్ – అల్లు అర్జున్ అభిమానుల మధ్య రచ్చ కొనసాగుతూనే వుంది. ఇప్పుడు ఇంకోసారి ఆ వివాదం తెరపైకొచ్చింది. అల్లు అర్జున్ అభిమానుల్ని మెగా అభిమానులు పక్కన పెట్టారన్నది తాజాగా వినిపిస్తోన్న ఓ వాదన. దాంతో, అల్లు అర్జున్ అభిమానులు గుస్సా అవుతున్నారు.

మరోపక్క, కొందరు అల్లు అర్జున్ అభిమానులు గతంలో పవన్ – అల్లు అర్జున్ కలిసి జనసేన వేదికను పంచుకున్న ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మెగా కుటుంబం అయితే గంపగుత్తగా జనసేనకు మద్దతివ్వనుంది. అందులో అల్లు అర్జున్ కూడా సభ్యుడే గనుక, వివాదానికి ఆస్కారమేముంది.?