నరేంద్ర మోడీని వైఎస్ జగన్ ఎందుకు ప్రశ్నించట్లేదు.?

ప్రధాని నరేంద్ర మోడీని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎందుకు ప్రశ్నించడంలేదు.? ఈ ప్రశ్న తెరపైకి రావడానికి కారణం పొరుగు రాష్ట్రం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ప్రధాని నరేంద్ర మోడీపై దుమ్మెత్తిపోస్తుండడమే.

రైతుల సమస్యలు, పెట్రో ధరలు సహా పలు అంశాలపై కేంద్రాన్ని తెలంగాణ సీఎం కేసీయార్ నిలదీస్తోంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రం సైలెంటయ్యారు. ఏపీ మంత్రులు, ఏపీ ప్రభుత్వ సలహాదారు స్థాయిలోనే కేంద్రంపై విమర్శలు కనిపిస్తున్నాయి తప్ప, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించకపోవడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.

అయితే, రాష్ట్ర ప్రభుత్వం తరఫున పత్రికా ప్రకటన (అడ్వర్టైజ్మెంట్ రూపంలో) పెట్రో ధరల వ్యవహారంపై వివరణ వచ్చాక, ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన అవసరమేముందన్నది వైసీపీ వర్గాల వాదన. అయినాగానీ, ముఖ్యమంత్రి స్పందించకపోతే.. తెరవెనుకాల బీజేపీ – వైసీపీ లాలూచీ.. అన్న సంకేతాలు ప్రజల్లోకి ఖచ్చితంగా వెళతాయి.

దేశంలో పలు రాష్ట్రాలు పెట్రో ధరల్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి.. కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన తర్వాత. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలపై ఒత్తిడి పెరిగింది. ఆ ఒత్తిడి నేపథ్యంలోనే కేసీయార్ గుస్సా అవుతున్నారు, ఏపీ ప్రభుత్వం కూడా వివరణ ఇస్తోంది.

కానీ, దేశంలో రాజకీయ వాతావరణం మారుతోంది. మోడీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. దాంతో, ఇతర రాజకీయ పార్టీలు మరింత గట్టిగా గళం విప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ క్రమంలోనే కేసీయార్ గొంతు సవరించుకుంటున్నారనే వాదనా లేకపోలేదు.

అదే సమయంలో, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఇరకాటంలో పడేసేందుకు కేసీయార్ కొత్త మార్గాన్ని ఎంచుకున్నారన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.