Rahul Gandhi Telangana Tour : కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి నేతగా, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తనయుడిగా, ఓ ఎంపీగా రాహుల్ గాంధీ దేశంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అలాగే, ఆయన తెలంగాణకీ వచ్చారు. రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన కోసం కాంగ్రెస్ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేశాయి. రాజకీయం – విద్యార్థులు.. రెంటినీ విడదీసి చూడలేని కాలమిది. పైగా, ఉస్మానియా యూనివర్సిటీని తెలంగాణ రాజకీయాల నుంచి వేరు చేయలేం.
కానీ, ఆ ఉస్మానియా యూనివర్సిటీకి రాహుల్ గాంధీ వెళ్ళకుండా అధికార తెలంగాణ రాష్ట్ర సమితి తనదైన కుట్ర పన్నిందనేది కాంగ్రెస్ ఆరోపణ. సరే, యూనివర్సటీల్లో రాజకీయాలేంటి.? అన్నది వేరే చర్చ. అన్ని రాజకీయ పార్టీలూ యూనివర్సిటీలను వేదికగా చేసుకునే రాజకీయాలు చేస్తున్న రోజులివి.
అసలు రాహుల్ గాంధీ విషయంలో ఎందుకు తెలంగాణ రాష్ట్ర సమితి ఆందోళన చెందాలి.? ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితికి కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టి పోటీ ఏమీ లేదు. పైగా, ప్రశాంత్ కిషోర్ పుణ్యమా అని కాంగ్రెస్, టీఆర్ఎస్.. 2023 ఎన్నికల నాటికి కలిసినా ఆశ్చర్యపోవాల్సిన పనేముంది.?
బీజేపీకి మండుతుందేమోనని బహుశా రాహుల్ పర్యటన విషయంలో తెలంగాణ రాష్ట్ర సమతి ప్రస్తుతానికి అతి చేస్తోందేమోనన్నది చాలామంది రాజకీయ విశ్లేషకుల అనుమానం. బీజేపీతో గులాబీ పార్టీకి రాజకీయ పంచాయితీ వున్నా, తెరవెనుకాల ఆ రెండు పార్టీలూ ఒక్కటేనన్న విమర్శలు లేకపోలేదు.
ఏమో, రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. రాహుల్ పర్యటన తర్వాత తెలంగాణలో రాజకీయాలు మారతాయా.? మారితే అవెలా వుంటాయి.? వేచి చూడాల్సిందే.