‘తెలంగాణ దోపిడీకి గురయ్యింది.. సీమాంధ్ర ప్రాంతానికి చెందినవారే ఎక్కువ కాలం పాటు ఉమ్మడి ఆంధ్రపదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించారు. వారి పాలనలో తెలంగాణకు అన్యాయం జరిగింది. ఆ ఆవేదనతో మేం విమర్శిస్తాం.. కడుపు మండి మేం నాలుగు మాటలు మాట్లాడితే పడాల్సిందే..” అంటూ తెలంగాణ రాష్ట్ర సమితి నేత, మంత్రి శ్రీనివాస్ గౌడ్ సెలవిచ్చారు.
తెలంగాణ దోపిడీకి గురయ్యిందా.? తెలంగాణకు అన్యాయం జరిగిందా.? అన్న విషయాల్ని పక్కన పెడితే, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నేతలు ముఖ్యమంత్రులవడం వల్ల.. ఆ సీమాంధ్ర ప్రాంతానికి అదనంగా ఒరిగిందేమీ లేదు.
ఉమ్మడి తెలుగు రాష్ట్రం విడిపోయి, ఏడేళ్ళయినా అక్కడ ఇంతవరకు సరైన రాజధాని లేదు. ఏదీ మీ రాజధాని.? అని ఎవరన్నా ప్రశ్నిస్తే, తలెత్తుకు తిరగలేని దుస్థితి ఆంధ్రపదేశ్ ప్రజలది. తెలంగాణ కనికరిస్తే తప్ప, నీళ్ళు కిందికి దిగవు.. ఆంధ్రపదేశ్ రాష్ట్రంలోకి. ఇవన్నీ కళ్ళ ముందుకు కనిపిస్తున్న వాస్తవాలే. తెలంగాణలో వైద్య రంగం అభివృద్ధి చెంది. తెలంగాణలో క్రీడలు అభివృద్ధి చెందాయి. విద్య సహా ఏ రంగాన్ని తీసుకున్నా ఆంధ్రపదేశ్ కంటే ఎన్నో రెట్లు మెరుగైన స్థితిలో తెలంగాణ వుంది.
కానీ, ఆంధ్రపదేశ్ పరిస్థితేంటి.? కరోనా వేళ, ఆంధ్రపదేశ్ నుంచి తెలంగాణకు అంబులెన్సులు నిలిచిపోయిన దుస్థితిని చూశాం. ఇవన్నీ చూశాక నష్టపోయింది ఎవరు.? అని ప్రశ్నిస్తే విజ్నత వున్నవారెవరైనా చెప్పే సమాధానం ఒకటే.. నష్టం ఆంధ్రపదేశ్ రాష్ట్రానికే ఎక్కువ జరిగిందని. ఏ రాజశేఖర్ రెడ్డిని అయితే ఈ రోజు టీఆర్ఎస్ విమర్శిస్తోందో, ఆ రాజశేఖర్ రెడ్డి పంచనే చేరింది ఒకప్పుడు టీఆర్ఎస్.
ఏ సమైక్య పాలకుల్నయితే ఈ రోజు విమర్శిస్తున్నారో.. వారి పాలనలో మంత్రులుగా తెలంగాణ నేతలూ వెలగబెట్టిన విషయాన్ని ఎలా కాదనగలం.? రాజశేఖర్ రెడ్డినీ, చంద్రబాబునీ, ఇంకో నాయకుడ్నీ తిట్టేటప్పుడు, వారి మంత్రి వర్గంలో పనిచేసిన తెలంగాణ నేతల్నీ తిట్టాలి కదా.?