War Cloud : ఉక్రెయిన్ మీద రష్యా దండయాత్ర చేస్తోంది. అయితే, ఉక్రెయిన్ మీద తమకేమీ అధికారం అక్కర్లేదంటోంది రష్యా. మరెందుకు ఉక్రెయిన్ మీద రష్యా దాడి చేయాలి.? దానికి చాలా కారణాలున్నాయి. ‘నాటో’లో చేరి, రష్యా మీద విరుచుకుపడాలని ఉక్రెయిన్ వ్యూహం రచిస్తోంది. నిజానికి, ఇది ఉక్రెయిన్‌కి వచ్చిన ఆలోచన కాదు, అగ్రరాజ్యం అమెరికా పైత్యం. ఎప్పుడూ ఎక్కడో ఓ చోట అలజడి సృష్టించకపోతే ‘పెద్దన్న’ అమెరికాకి నిద్రపట్టదు. అదే అసలు సమస్య.
ఉక్రెయిన్ ద్వారా రష్యాలో అలజడికి అమెరికా ప్రయత్నిస్తున్న దరిమిలా, ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన రష్యా, ఈ మేరకు ఉక్రెయిన్‌ని హెచ్చరించింది. మాట వినకపోతే దాడి తప్పదంటూ పదే పదే హెచ్చరికలు జారీ చేసింది. ‘వస్తే, మీ సంగతేంటో చూస్తాం..’ అంటూ ఉక్రెయిన్ రెచ్చగొట్టింది.. ఫలితం అనుభవిస్తోంది. సరే, ఉక్రెయిన్ – రష్యా మధ్య జరుగుతున్న వ్యవహారంపై ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి.
అసలు మనమెందుకు రష్యాని ఈ విషయంలో తప్పుపట్టాలి.? రష్యా మనకి మిత్రదేశం. 1971లో రష్యా గనుక భారతదేశానికి సాయపడి వుండకపోతే, బారతదేశం ఇప్పుడెలా వుండేదో.. అసలు వుండేదో లేదో.! 1971లో బంగ్లాదేశ్ విముక్తి కోసం (అప్పటి తూర్పు పాకిస్తాన్ అది) భారతదేశం ప్రయత్నిస్తున్న సమయం.
పాకిస్తాన్‌కి మద్దతుగా అమెరికా రంగంలోకి దిగింది.. బ్రిటన్ లాంటి దేశాలూ భారతదేశంపై పరోక్షంగా కత్తిదూసేందుకు సిద్ధమయ్యాయి. వాటన్నిటి బలం ముందు, బారతదేశం నిర్వీర్యమైపోతుంది. సరిగ్గా ఆ సమయంలో రష్యా, భారతదేశానికి అండగా నిలిచింది.
రష్యాకి చెందిన జలాంతర్గాములు గనుక, భారతదేశానికి అండగా వచ్చి వుండకపోతే.. ఆనాటి పరిస్థితులు ఇంకోలా వుండేవి. సరే, ఆ సంగతి పక్కన పెడదాం. భారత అమ్ములపొదిలో ప్రధాన అస్త్రాలుగా చెప్పబడుతోన్నవాటిలో చాలావరకు రష్యా నుంచి దిగుమతి చేసుకున్నవే. అంతలా ఆయుధాల విషయంలో రష్యాతో భారతదేశం స్నేహాన్ని కొనసాగిస్తోంది.
రష్యాకి చైనా కూడా మిత్రదేశమే. అది ఓ రకంగా భారతదేశానికి కలిసొచ్చే అంశం. ఉక్రెయిన్ – రష్యా మధ్య రగడ, ఆ రెండు దేశాలకి సంబంధించిన అంశం. మన భారత పౌరుల్ని ఉక్రెయిన్ నుంచి తెచ్చుకునేందుకు రష్యా సహకరించిందన్న విషయాన్ని విస్మరించి, రష్యా మీద మన మీడియా అవాకులు చెవాకులు పేలితే ఎలా.?