ఈటెల రాజేందర్ నుంచి మంత్రి పదవి లాగేసుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. కానీ, ఈటెలను పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు. రఘురామ విషయంలో వైసీపీ కూడా, ఆయన్ని సస్పెండ్ చేసేందుకు సుముఖత వ్యక్తం చేయడంలేదు. పార్టీ నుంచి సస్పెండ్ అయితే ఆయా ప్రజా ప్రతినిథులకు అది అడ్వాంటేజ్ అవుతుంది తప్ప.. ఇబ్బందికరంగా ఏమీ మారదు. ఇదివరకట్లో అయితే, రాజకీయాల్లో కాస్తో కూస్తో నైతిక విలువలుండేవి. పార్టీ మారితే రాజీనామా చేయాల్సిందే. కానీ, ఇప్పుడా పరిస్థితుల్లేవు. ప్రజా ప్రతినిథులు పార్టీల్ని చాలా తేలిగ్గా మార్చేస్తున్నారు. రాజకీయమంటేనే కప్పల తక్కడగా మారిపోయింది. టీడీపీ, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలను లాక్కుని, తెలంగాణ రాష్ట్ర సమితి మరింతగా బలాన్ని పెంచుకుంది.
దాంతో, ఈటెల రాజేందర్ నుంచి రాజీనామాని డిమాండ్ చేయలేని దుస్థితి గులాబీ పార్టీది. ఇదే పరిస్థితి వైసీపీకి కూడా వుంది. టీడీపీ నుంచి ఎమ్మెల్యేలను వైసీపీ లాగేసింది. దాంతో, వైసీపీకి దూరమైన రఘురామపై రాజీనామా డిమాండ్ వైసీపీ ఎంతగట్టిగా చేసినా అందులో అర్థం లేదు. ‘దమ్ముంటే రాజీనామా చెయ్..’ అంటూ మీడియా ముందుకొచ్చి గగ్గోలు పెట్టడం తప్ప, ఈటెల విషయంలో టీఆర్ఎస్ అయినా, రఘురామ విషయంలో వైసీపీ అయినా చేయగలిగిందేమీ లేదు. నిజానికి, అటు వైసీపీ అయినా ఇటు టీఆర్ఎస్ అయినా తమ తమ రాష్ట్రాల్లో చాలా బలంగా వున్నాయి. ఆయా ప్రజా ప్రతినిథుల్ని సస్పెండ్ చేసి, వారి రాజీనామా కోరితే.. తద్వారా వచ్చే ఉప ఎన్నికలతో రాజకీయంగా లబ్ది పొందొచ్చు. కానీ, అవతలి వ్యక్తి మళ్ళీ గెలిస్తే.. ఏమవుతుందోనన్న భయం ఆయా పార్టీలను వెంటాడుతోంది. అందుకే ఈటెల అయినా, రఘురామ అయినా తమ తమ పదవుల విషయంలో.. తమ తమ పార్టీలకు ఎప్పటికప్పుడు ఝలక్ ఇస్తూనే వున్నారు.