Roja : వైసీపీ ఎమ్మెల్యే రోజాకి మళ్ళీ అదే సమస్య.! తప్పెవరిది.?

Roja : తెలుగుదేశం పార్టీలో వున్నప్పుడూ అదే పరిస్థితి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనూ అదే దుస్థితి. రాజకీయాల్లో సినీ నటి రోజా ఎదుర్కొంటోన్న ఎత్తుపల్లాలు అన్నీ ఇన్నీ కావు. బహుశా ఇంకెవరికీ ఇలాంటి సమస్యలు ఎదురై వుండవేమో. రాజకీయ ప్రత్యర్థుల నుంచి వచ్చే సమస్యల్ని అయితే రోజా తేలిగ్గానే ఎదుర్కొంటారు. కానీ, సొంత పార్టీలోనే ఆమెకు కుంపట్లు ఎదురవుతుంటాయి. అదే అతి పెద్ద సమస్య ఆమెకి.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి రోజా అత్యంత సన్నిహితురాలు.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద రాజకీయ ప్రత్యర్థులెవరైనా విమర్శలు చేస్తే, తనదైన వాగ్ధాటితో విరుచుకుపడిపోతారు రోజా. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నుంచి రోజాకి కూడా అంతే ప్రాధాన్యం దక్కుతుంటుంది.

తొలిసారి వైసీపీ నుంచే ఆమె ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. అలా తన రాజకీయ జీవితంలో తొలిసారిగా చట్ట సభల్లో అడుగుపెట్టే అవకాశం వైసీపీ అధినేత వైఎస్ జగన్ ద్వారా కలగడం పట్ల ఆమె ఎప్పుడూ కృతజ్ఞతాభావంతోనే వుంటారనుకోండి.. అది వేరే సంగతి.

కానీ, మంత్రి పదవి విషయంలో కావొచ్చు, ఇతరత్రా విషయాల్లో కావొచ్చు రోజాకి అన్యాయమే జరుగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, కీలకమైన మంత్రి పదవి రోజాకి దక్కుతుందని గతంలో ప్రచారం జరిగింది. ఏం లాభం.? ఎమ్మెల్యే రోజా, మంత్రి రోజా అవలేకపోయారు. అందుకు సామాజిక వర్గ సమీకరణాలే కారణమంటూ వైసీపీ అధిష్టానం సన్నాయి నొక్కులు నొక్కింది.

ఇక, సొంత నియోజకవర్గంలోనూ వైసీపీ ఎమ్మెల్యే రోజాకి సొంత పార్టీ నుంచే అసమ్మతి సెగ కనిపిస్తోంది. స్థానిక ఎన్నికల్లో రోజాని స్థానిక నేతలెవరూ లెక్క చేయలేదు. అసమ్మతి నేతలకు మాత్రం వైసీపీ అధిష్టానం కీలక పదవులు కట్టబెడుతూనే వుంది. అంటే, అసమ్మతిని వైసీపీ అధిష్టానమే రోజాపైకి ఎగదోస్తోందన్నమాట.

తాజాగా శ్రీశైలం దేవస్థానం పాలక మండలిలో అసమ్మతినేత చక్రపాణిరెడ్డికి అవకాశం దక్కడం పట్ల రోజా గుర్రుగా వున్నారు. ‘ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాల్లో కొనసాగలేను.. రాజీనామా తప్ప మరో మార్గం కనిపించడంలేదు..’ అంటూ రోజా తన సన్నిహితుల వద్ద వాపోతున్నారట. ‘పోతే పోనీ..’ అన్నట్టుగా రోజా విషయంలో వైసీపీ అధిష్టానం లైట్ తీసుకుంటోందన్న ప్రచారం జరుగుతోంది.