సీఎం వైఎస్ జగన్‌తో భేటీకి పవన్ ఎందుకు వెళ్ళకూడదు.?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో త్వరలో సినీ పరిశ్రమకు చెందిన ‘ప్రతినిథుల బృందం’ భేటీ కాబోతోంది. గతంలో చిరంజీవి నేతృత్వంలో పలువురు సినీ ప్రముఖులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆ తర్వాత సినీ పరిశ్రమ సమస్యలు పరిష్కారమయ్యాయా.? లేదా.? అన్న విషయాన్ని పక్కన పెడితే, ‘చిరంజీవి, సినీ పరిశ్రమలో అందర్నీ కలుపుకుపోవడంలేదు..’ అన్న విమర్శ అయితే వచ్చింది. నిజానికి, సినీ ప్రముఖులంతా చిరంజీవిని ముందు పెట్టి, తెలంగాణ ముఖ్యమంత్రి వద్దకూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వద్దకూ ప్రతినిథుల బృందాన్ని పంపి, తమ సమస్యల్ని ఏకరువు పెట్టడం చూశాం. ఇప్పుడూ అదే జరగబోతోంది. అయితే, సినీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లో రోజా వున్నారు, బాలకృష్ణ వున్నారు, పవన్ కళ్యాణ్ వున్నారు.. ఇంకా చాలామందే వున్నారు.

అలాంటివారిని ముఖ్యమంత్రి దగ్గరకు తీసుకెళితే, పరిశ్రమ తన వాదనను బలంగా విన్పించడానికి ఆస్కారమేర్పడుతుంది. పవన్ కళ్యాణ్ కేవలం సినీ నటుడే కాదు, జనసేన పార్టీ అధినేత. పైగా, ఇప్పడాయన వరుసగా చాలా సినిమాలు చేసేస్తున్నారు. ఆయన నటించిన ‘వకీల్ సాబ్’ సినిమా టిక్కెట్ల విషయమై ఏపీలో వివాదం నడిచింది. ప్రభుత్వమే కుట్రపూరితంగా వ్యవహరించిందన్న విమర్శలున్నాయి. అన్నట్టు, పవన్ కళ్యాణ్ నిర్మాత కూడా. దర్శకత్వం వహించారాయన ‘జానీ’ సినిమాకి గతంలో. సో, పవన్ గనుక వైఎస్ జగన్ వద్దకు సినీ పరిశ్రమ ప్రముఖులతో వెళితే, ఇంకాస్త నిండుగా వుంటుందేమో ఆ బృందం. మరి, బాలయ్య మాటేమిటి.? రోజా సంగతేంటి.? బాలయ్య, రోజా కూడా సినీ పరిశ్రమ తరఫున వెళితే, పరిశ్రమ సమస్యలకు పరిష్కారం దొరకొచ్చు.