ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో శత్రుత్వం పెట్టుకోవడానికి ఎవ్వరు సాహసం చెయ్యరు.అయితే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో ఉన్న లక్షణాలే తనకు శత్రువుగా మారుతున్నాయని పార్టీ సీనియర్ నాయకులు, రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే నవరత్నాలను అమలు చెయ్యడం ప్రారంభించారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయినా కూడా పట్టించుకోకుండా, ధైర్యంగా, మొండిగా ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేశారు. ఇలా అప్పులు చేసి సంక్షేమ పథకాలు ఇవ్వాల్సిన అవసరం లేదని తెల్సి కూడా గుడ్డిగా మాట ఇచ్చాను కాబట్టి అమలు చేయాల్సిందేనని పట్టు పట్టిన నాయకుడు జగన్. అలాంటి నాయకుడికి తానే శత్రువుగా మారుతున్నారు.
జగన్ కు జగనే శత్రువు
తాను చేస్తున్న అభివృద్ధి పనుల గురించి, ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల గురించి కానీ, తీసుకుంటున్న నిర్ణయాలు గురించి కానీ జగన్మోహన్ రెడ్డి అస్సలు మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం లేదు. ఇతర నాయకుల చేతనో, అధికారాలు చేతనో చెప్పిస్తున్నారు కానీ జగన్ మాట్లాడటం లేదు. జగన్ మౌనంగా ఉండటంతో ప్రతిపక్షాల నాయకులు జగన్ ఇష్టమొచ్చినట్టు విమర్శిస్తున్నారు. ఆ విమర్శలు హద్దులు దాటినా కూడా జగన్ స్పందించడం లేదు. నిర్ణయం ఏదైనా కానీ జగన్ స్పందించకపోవడం అనేది మాత్రం వైసీపీకే మంచిది కాదు. ఎందుకంటే తనపై, తన ప్రభుత్వంపై ఎన్ని విమర్శలు వచ్చినా కూడా జగన్ మౌనంగా ఉండటం వల్ల ప్రజలు ఆ విమర్శలే నిజమనుకునే అవకాశం ఉంది. కాబట్టి జగన్ మౌనం వీడి మాట్లాడాలని వైసీపీ నేతలతో పాటు రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు.
మోడీని జగన్ అనుసరిస్తున్నారా!
అధికారంలోకి వచ్చిన తరువాత ఓపెన్ ప్రెస్ మీట్ పెట్టని ప్రధానుల్లో నరేంద్ర మోడీ ఒకరు. ఆయన ఇప్పటి వరకు ఒక్కసారి మీడియా ముందు వచ్చి తన ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను ఖండించలేదు. ఇప్పుడు జగన్ కూడా ఈ విమర్శల విషయంలో మోడీని అనుసరిస్తున్నారని తెలుస్తుంది. మోడీ కొన్నిసార్లు మీడియా ముందు తప్పులు మాట్లాడి సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ గురి అయ్యారు, అలాగే జగన్ కూడా కరోనా టైం లో కొన్ని ప్రెస్ మీట్ లలో తప్పులు మాట్లాడుతూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురి అయ్యారు. తప్పులు మాట్లాడుతాననే భయంతోనో, విమర్శలకు సమాధానం చెప్పడం ఇష్టంలేకనో జగన్ మౌనం పాటిస్తున్నారు. కానీ ఈ మౌనం రానున్న రోజుల్లో జగన్ కే ప్రమాదం.