విశాఖ ఘ‌ట‌న‌పై గంటా మౌనం దేనికో?

విశాఖ ఎల్జీ పాలిమ‌ర్స్ గ్యాస్ లీకేజ్ ఘ‌ట‌న దేశ వ్యాప్తంగా ఎంత సంచ‌ల‌న‌మైందో తెలిసిందే. ప‌దుల సంఖ్య‌లో మ‌ర‌ణాలు..వంద‌ల సంఖ్య‌లో అస్వ‌స్థ‌త‌కు గురై ఉక్కిరిబిక్కిర‌య్యారు. బ్రతుకు జీవుడా అంటూ ప్రాణాలు అర‌చేతిలో ప‌ట్టుకుని ప‌రుగులు తీసారు. అప‌స్మార‌క స్థితిలోకి  వారంతా విశాఖ‌లో వేర్వేరు ఆసుప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. మూడు రోజులుగా ఆసుప‌త్రుల‌న్నీ ఆర్థ‌నాధాల‌తో మార్మోగుతున్నాయి. ఘ‌ట‌న‌పై కేంద్ర‌-రాష్ర్ట ప్ర‌భుత్వాలు స‌హా స్థానిక నేత‌లు దిగ్ర్భాంతి వ్య‌క్తం చేసారు. వైకాపా ప్ర‌భుత్వం బాధితుల‌ను అన్నిర‌కాలు ఆదుకుంటుంద‌ని హామీ ఇచ్చి ఆదిశ‌గా చ‌ర్య‌లు వేగవంతం చేసింది. అధికార ప‌క్షానికి చెందిన‌ స్థానిక నేత‌లు బాధితుల్ని పరామ‌ర్శించి ధైర్యం చెప్పారు.

అయితే విశాఖ కంచుకోట‌గా అప‌జ‌య‌మెర‌గ‌ని నాకుడిగా పేరొందిన టీడీపీ పార్టీ వైజాగ్ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావు మాత్రం ప‌త్తా లేకుండా పోయారు. ఘ‌ట‌న జ‌రిగి మూడు రోజులు గ‌డుస్తోన్న ఇప్ప‌టివ‌ర‌కూ గంటా బాధితుల్ని ప‌రామ‌ర్శించింది లేదంటూ పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లు వెత్తుతున్నాయి. బాధితుల‌కు ఆర్ధిక స‌హాయం మాట పక్క‌న‌బెట్టిన క‌నీసం ప‌రామ‌ర్శ కూడా నోచుకోక‌పోవ‌డం విశాఖ వాసుల దౌర్భాగ్య‌మంటూ స్థానిక నేత‌లు దుయ్య‌బెట్టారు. విశాఖ లో ఏ నియోజ‌క వ‌ర్గం నుంచి పోటీ చేసినా గంటా గెల‌పు ఖాయ‌మంటారు. విశాఖ కంచుకోట‌గా ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు.

గ‌త ప్ర‌భుత్వం టీడీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు ఐదేళ్ల పాటు మంత్రిగా ప‌నిచేసారు. విశాఖ ఓటు బ్యాంక్ గా అక్క‌డి ప్ర‌జ‌లు గంటా గురించి మొన్న‌టి వ‌ర‌కూ ఎంతో గొప్ప‌గా చెప్పుకునేవారు. కానీ గంటా తాజా వైఖ‌రితో ఇప్పుడ‌స‌లు ప‌రామ‌ర్శికి వెళ్లినా తిర‌గ‌బ‌డే స‌న్నివేశ‌మైతే ఉంద‌ని వినిపిస్తోంది. ఇంత పెద్ద ప్ర‌మాదం జ‌రిగినా క‌నీసం సోష‌ల్ మీడియాలోనైనా ఎలాంటి కామెంట్ చేయ‌కపోవ‌డంతో శోచ‌నీయ‌మంటున్నారు. అయితే గంటా వెళ్ల‌క‌పోవ‌డానికి మ‌రో వెర్ష‌న్ కూడా వినిపిస్తోంది. వైకాపా అధికారంలోకి రావ‌డం..ఆ వెంట‌నే మూడు రాజ‌ధానుల ప్ర‌క‌ట‌న‌లో భాగంగా ఎగ్జిక్యుటివ్ రాజ‌ధానిగా వైజాగ్ అవ్వ‌డంతో గంటా వైకాపా తీర్ధం పుచ్చుకునే ప్ర‌య‌త్నాలు చేసారుట‌.

ఆయ‌న‌తో పాటు, మ‌రో న‌లుగురు టీడీపీ ఎమ్మేల్యేల‌ను వైకాపాలోకి తెచ్చే ప్ర‌య‌త్నాలు జ‌రిగాయట‌. కానీ గంటా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆపార్టీకి జంప్ అవ్వ‌డం ఆల‌వాటు అనే విమ‌ర్శ ఉంది. ఆ కార‌ణంగా వైకాపా పెద్ద‌లు గంటా ఎంట్రీ విష‌యంలో అడ్డు త‌గులుతున్నార‌ని తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. ఆ కార‌ణంగానే గంటా వైకాపాపై విమ‌ర్శ‌లు చేయ‌లేక‌? చ‌ంద్రబాబును అంటిపెట్టుకుని ఉండ‌లేక? స‌త‌మ‌త‌మ‌వుతున్నాడ‌ని ఇన్ సైడ్ టాక్. అయితే ఇలాంటి ప్ర‌మాదాల విష‌యంలో రాజ‌కీయాల‌న్నింటిని ప‌క్క‌న‌బెట్టి స్పందిచాల్సిన అవ‌సరం గంటాపై ఎంతైనా ఉంది.