Covid Tsunami : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణకి కారణమేమిటంటే.!

Covid Tsunami : తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణతో పోల్చితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ప్రమాదకరమైన రీతిలో కోవిడ్ 19 విస్తరిస్తోంది. ‘ఇప్పుడు వస్తున్నవన్నీ ఒమిక్రాన్ కేసులే..’ అని వైద్య నిపుణులు చెబుతునప్పటికీ, అధికారిక గణాంకాల ప్రకారం ఒమిక్రాన్ కేసులు నామమాత్రంగానే వున్నాయి. మరి, విస్తరిస్తున్న కోవిడ్ 19 ఏ వేరియంట్‌కి సంబంధించినది.?

‘మీ హైద్రాబాద్‌లో కోవిడ్ చాలా ఎక్కువగా వుందట కదా.?’ అన్న ప్రశ్నలు ఏపీలోని బంధువుల నుంచి తెలంగాణలో నివాసం వుంటోన్న సీమాంధ్రులకు ఎదురవుతున్నాయి. కానీ, వాస్తవ పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా వున్నాయి. చాపకింద నీరులా ఏపీలో కోవిడ్ విస్తరించేస్తోంది. కానీ, దాన్ని ఏపీ ప్రజలు గుర్తించే పరిస్థితుల్లో లేరు. అదే అన్ని అనర్ధాలకు కారణమవుతోంది.

మొదటి వేవ్ సమయంలోనూ, రెండో వేవ్ సమయంలోనూ ఇదే నిర్లక్ష్యం.. రాష్ట్రాన్ని నిలువునా ముంచేసింది. ఆంధ్రప్రదేశ్‌లో వైద్య సౌకర్యాలు సరిపోక, పొరుగు రాష్ట్రాల వైపు ఏపీ ప్రజలు వైద్యం కోసం పరుగులు తీయాల్సి వచ్చింది. రాజకీయ నాయకుల సంగతి సరే సరి.

ఒమిక్రాన్ తీవ్రత తక్కువేనన్న ప్రచారంతో మరింత విచ్చలవిడితనం ఏపీ ప్రజల్లో కనిపిస్తోంది. రాజకీయ నాయకులూ అత్యంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు. సంక్రాంతి పండగ నేపథ్యంలో అసలెక్కడా కోవిడ్ నిబంధనలు అమలు కావడంలేదు. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ నెత్తిన కోవిడ్ పిడుగు పడేలా చేస్తోంది.

ఇక, ఇప్పుడు.. అట్నుంచి ఇటు.. అంటే తెలంగాణ వైపుగా ఏపీ నుంచి కోవిడ్ సునామీలా విరుచుకుపడే అవకాశాలు కన్పిస్తున్నాయి. గత రికార్డుల్ని చాలా తేలిగ్గా.. జస్ట్ కొన్ని రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్‌ బద్దలుగొట్టేసేలా వుంది. ఆ ప్రభావం తెలంగాణపై ఎంత.? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. తెలంగాణలో కోవిడ్ టెస్టులు ఎక్కువగానే జరుగుతుండగా, ఏపీలో టెస్టులు కూడా చాలా తక్కువగా జరుగుతున్నాయి. తక్కువ టెస్టులకే ఎక్కువ కేసులు.. మరి, ఎక్కువ టెస్టులు చేస్తే.!