కార్టూనిస్ట్ శ్రీధర్ ‘ఈనాడు’ని ఎందుకు వదిలేశారంటే..

కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు.? అన్న ప్రశ్న అప్పట్లో హాట్ టాపిక్. కార్టూనిస్ట్ శ్రీధర్ ఎందుకు ‘ఈనాడు’లో ఉద్యోగం వదిలేశారన్నది ఇప్పుడు హాట్ టాపిక్. మీడియా రంగంలో ఇప్పుడీ ప్రశ్న చుట్టూ కుప్పలు తెప్పలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. బోల్డన్ని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరి గోల వారిదే. ఔనా, కార్టూనిస్ట్ శ్రీధర్ ‘ఈనాడు’లో ఉద్యోగం మానేశారా.? అని పాఠకులూ చర్చించుకుంటున్నారు. తెలుగు మీడియా రంగంలో ‘కార్టూనిస్ట్ శ్రీధర్’ తన కార్టూన్లతో ‘ఈనాడు’ ద్వారా వేసిన ముద్ర అలాంటిది మరి. కొన్నాళ్ళ క్రితం ఆయన అనారోగ్యానికి గురైతే, ఆ సమయంలో ఈనాడులో కార్టూన్లు రాలేదు. ఆయన కాకుండా మరొకరితో కార్టూన్లు వేయించడాన్ని ‘ఈనాడు’ అధిపతి రామోజీరావు ఇష్టపడలేదు. ఆ సమయంలోనే రామోజీరావుకీ, కార్టూనిస్ట్ శ్రీధర్‌కీ చెడిందన్న ప్రచారం జోరుగా సాగినా, అదంతా ఉత్తదేనని తేలిపోయింది.

ఆ తర్వాత ఈనాడులో శ్రీధర్ కార్టూన్లు షరామామూలుగానే కనిపించాయి. ఏమయ్యిందోగానీ, దాదాపు నాలుగు దశాబ్దాల బంధాన్ని తెంచుకుని కార్టూనిస్ట్ శ్రీధర్, ‘ఈనాడు’ నుంచి బయటకు వచ్చేశారు. దాంతో, ఈసారి ఇంకా గట్టిగా ఈ విషయమై పుకార్లు షికార్లు చేసేస్తున్నాయి. ఓ మీడియా సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించడంతోనే ఈనాడుకి కార్టూనిస్ట్ శ్రీధర్ రాజీనామా చేశారంటున్నారు. అదేమీ కాదు, ఈనాడులో ఆయనకు అవమానాలు ఎదురయ్యాయని మరికొందరంటున్నారు. ఏది నిజమోగానీ, శ్రీధర్ కార్టూన్ లేని ఈనాడుని ఊహించుకోలేం. అయితే, అది కొద్ది రోజులు మాత్రమే వుండే ఫోబియా. ఆ తర్వాత షరామామూలే అయిపోవచ్చు. కానీ, ఇంతలా ఈ అంశం గురించి అంతా చర్చించుకుంటున్నారటే.. ఇక్కడ ఈనాడుకి వున్న ఫాలోయింగ్, అలాగే కార్టూనిస్ట్ శ్రీధర్‌కి వున్న ఫాలోయింగ్ స్పష్టమవుతోందన్నమాట.