స్కూళ్లు తెరవడానికి అడ్డురాని కరోనా స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు మాత్రం అడ్డొస్తోందని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. పిల్లల జీవితాలతో ఆడుకోడానికి కరోనా అడ్డురాలేదని జగన్ సర్కారు తీరును తప్పుపట్టారు. లక్షలాది మంది విద్యార్థులు రోజు స్కూళ్లకు వెళ్లినా విస్తరించని కరోనా స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఒక్క రోజు పోలింగ్ బూత్ కు వచ్చి ఓటేస్తే ప్రబలుతుందా అని ప్రశ్నించారు. కరోనా పేరుతో కుంటి సాకులు చెప్పి ఎన్నికలను వాయిదా వేస్తోందని మండిపడ్డారు. కరోనాను కూడా రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్న ఘనత ఒక్క వైసీపీకే దక్కిందని ఆరోపించారు.
జగన్ సర్కారు అన్ని రంగాల్లో దారుణంగా విఫలమైంది మండిపడ్డారు. కరోనా మహమ్మారిలా విస్తరిస్తున్నా విపత్తు నిర్వహణలో సర్కారు దారుణంగా విఫలమైందని అన్నారు. ఓవైపు కరోనా.. మరో వైపు వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నా జగన్ సర్కారుకు పట్టించుకోవడం లేదని అన్నారు. హుద్ హుద్, తిత్లి తుఫాలప్పుడు టీడీపీ స్పందించిన తీరును ఇప్పటికీ ఏపీ ప్రజలకు గుర్తు చేసుకుంటున్నారని చెప్పారు.
కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన యువతను, వరదల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు జగన్ సర్కారు ఆదుకోలేదని అన్నారు. అభివృద్ధికి చరమగీతం పాడిన రాష్ట్ర సర్కారు సీమ సంస్కృతిని రాష్ట్రమంతటా విస్తరిస్తోందని ఆరోపించారు. విశాఖను వైసీపీ నేతలు ఫాక్షనిస్టుల అడ్డాగా మార్చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఏపీ రాజధాని మార్పు తర్వాత విశాఖలో బెదిరింపులు, భూకబ్జాలు పెరిగిపోయాయని అన్నారు. విశాఖ వాసులు అభివృద్దిని, ఉపాధిని కోరుకుంటారే తప్ప, హింస, విధ్వంసాలను సహించరని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ది పనులన్నీ నిలిచిపోయని అన్నారు. వైసీపీ బాధిత ప్రజానీకానికి అండగా ఉండాలని’ అని చంద్రబాబు టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.