Andhra Pradesh : అక్కడున్నది చంద్రబాబు ప్రభుత్వమా.? వైఎస్ జగన్ ప్రభుత్వమా.? అన్న చర్చ సంగతి పక్కన పెడితే, జాతీయ ప్రాజెక్టుని పూర్తి చేసుకోలేక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎనిమిదేళ్ళుగా పడుతున్న ఆపసోపాలు, ఫెయిలవుతున్న తీరు.. అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. సగటు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తలెత్తుకు తిరగలేని పరిస్థితిని తీసుకొస్తోంది.
పోలవరం జాతీయ ప్రాజెక్టు.. కేంద్రమే పూర్తిస్థాయి నిధులు ఇచ్చి పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయాల్సి వుంది. కానీ, తెలంగాణలో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి పూర్తి భిన్నం. తెలంగాణ ప్రభుత్వమే సొంత నిధులతో ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసుకుంది. నిజానికి, పోలవరంతో పోల్చితే కాళేశ్వరం అత్యంత సంక్లిష్టమైనది. కానీ, అనుకున్న సమయానికి కాస్త అటూ ఇటూగా ప్రాజెక్టు పూర్తయ్యింది. వ్యయం కూడా పోలవరం కంటే కాళేశ్వరం ప్రాజెక్టుకే ఎక్కువ అయ్యింది.
నిర్వాసితులకు ఆర్థిక సహాయం, పునరావాసం.. ఇవన్నీ పక్కాగా చేస్తూనే అనేక వివాదాల్ని ఎదుర్కొని తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుని పూర్తి చేసుకుంది.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జలయజ్ఞంలో భాగంగా అటు పోలవరం ప్రాజెక్టు, ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు (వేరే పేరుతో) తెరపైకొచ్చాయి. పోలవరం ప్రాజెక్టు విషయానికొస్తే వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కాల్వలకే పరిమితమయ్యారు.
చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టుపై చాలా అవినీతి ఆరోపణలు వచ్చాయి.. వైఎస్సార్ హయాంలోనూ ఆ ఆరోపణలు వున్నాయనుకోండి.. అది వేరే సంగతి. వైఎస్ జగన్ హయాంలోనూ పోలవరం ప్రాజెక్టు నత్తనడకన సాగుతోంది. ఈ వైఫల్యం ఎవరిది.? ముమ్మాటికీ రాష్ట్రంలో ప్రభుత్వాల్ని నడిపిన చంద్రబాబుది, నడుపుతున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదీ.. అదే సమయంలో ఆ పాపంలో కేంద్రానికీ భాగముంది.