వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఎవరు చంపారు.? షర్మిల ఆరోపణలు ఎవరిపైన.?

వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కుట్ర చేసి చంపారని ఎప్పుడైతే వైఎస్ షర్మిల ప్రకటించారో, అప్పటినుంచి తెలుగు రాష్ట్రాల్లో ఈ వ్యవహారం రాజకీయ ప్రకంపనలకు కారణమయ్యింది. ఇంతకీ, వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఎవరు చంపించారు.? ఎవరు ఆయన్ని అడ్డు తొలగించుకోవాలనుకున్నారు.?

నిజానికి, ఇలాంటి చర్చ జరగాలి గనుకనే వైఎస్ షర్మిల, అత్యంత వ్యూహాత్మకంగా వైఎస్ చనిపోయిన తర్వాత.. దాదాపు 13 ఏళ్ళ తర్వాత.. ‘వైఎస్ రాజశేఖర్ రెడ్డిది హత్య..’ అని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. తద్వారా వైఎస్ షర్మిల ఏం రాజకీయ లబ్ది పొందుతారు.? అన్నది వేరే చర్చ.

తెలుగు నాట సరికొత్త సంక్షేమానికి ఆద్యుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆరోగ్యశ్రీ, ఫీజు రీ-ఎంబర్స్‌మెంట్, 108 సేవలు.. ఇవన్నీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో తెరపైకొచ్చిన సంక్షేమ పథకాలే. తెలుగు నేలపై సరికొత్త రీతిలో సంక్షేమ సంతకం చేసిన ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది.

అలాంటి రాజశేఖర్ రెడ్డి చుట్టూ పొలిటికల్‌గా హైడ్రామా నడుస్తోందిప్పుడు. సంక్షేమ పథకాలకు తన తండ్రి పేరుని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెట్టడంలో వింతేమీ లేదు. ఇంకోపక్క, తన తండ్రిని హత్య చేశారనీ, తననూ హత్య చేస్తారని ప్రకటించడం ద్వారా వైఎస్ షర్మిల, చిత్ర విచిత్రమైన రాజకీయ ఎత్తుగడ వేశారు.

ఇది ప్రజాస్వామ్యం.! ఎవరైనా ఎలాగైనా మాట్లాడొచ్చనుకుంటే పొరపాటే. పదమూడేళ్ళపాటు తన తండ్రి మరణంపై ‘హత్య’ కోణంలో అనుమానాలు వ్యక్తం చేయకుండా, ఎలాంటి ఫిర్యాదూ చేయకుండా.. ఇప్పుడు రాజకీయంగా ఆరోపణలు చేయడం ఎంతవరకు సబబు.? అన్నదానిపై వైఎస్ షర్మిల ఆత్మవిమర్శ చేసుకోవాలి.

నిజమే, వైఎస్ రాజశేఖర్ రెడ్డిది అనుమానాస్పద రీతిలో సంభవించిన మరణమే. కానీ, ఇప్పుడు ఆరోపణలు చేస్తే నిజాలు బయటకు వస్తాయా.? 2019లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక అయినా, ఆ కోణంలో విచారణ చేయించగలిగి వుండాలి. కానీ, అలా జరగలేదు. అంటే, షర్మిల అనుమానం ఎవరిపైన.? ఆ అనుమానంలో నిబద్ధత ఎంత.?