ఇంతకీ పోలవరం ప్రాజెక్టు పాపం ఎవరిది.?

పోలవరం ప్రాజెక్టు విషయమై వైఎస్ జగన్ సర్కారు ఇప్పుడు నోరు మెదపలేని స్థితిలోకి వెళ్ళిపోయింది. పోలవరం జాతీయ ప్రాజెక్టు అయినా, ఆ ప్రాజెక్టుని పూర్తి చేయడానికి కేంద్రం చిత్తశుద్ధి ప్రదర్శించడంలేదు. రాష్ట్రానికి సహకరించడంలేదు.

జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం విషయంలో రాష్ట్రమెందుకు ఇంకా ఇబ్బందులు పడాల్సి వస్తోంది.? అదేదో పూర్తిగా కేంద్రానికే అప్పగించేయొచ్చుగా.? అంటే, ఉమ్మడి తెలుగు రాష్ట్ర విభజనతోనే పోలవరం ప్రాజెక్టుకి జాతీయ హోదా వచ్చింది. అప్పటిదాకా అది రాష్ట్ర ప్రాజెక్టే. దాంతో, రాష్ట్రమే ఆ ప్రాజెక్టు పనుల్ని కొనసాగించాల్సి వస్తోంది.

మరి, కేంద్రమెందుకు రాష్ట్రానికి పోలవరం విషయంలో చేయాల్సిన సాయం చేయలేకపోతోంది.? అంటే, దానికి చాలా కారణాలున్నాయి. రాష్ట్రంలో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య ఆధిపత్య పోరు నేపథ్యంలో జాతీయ పార్టీ, చోద్యం చూస్తోంది. కేంద్రాన్ని నడుపుతున్నది ఆ జాతీయ పార్టీ బీజేపీనే. దాంతో, టీడీపీ – వైసీపీ మధ్య మాటల యుద్ధాన్ని బీజేపీ చక్కగా ఎంజాయ్ చేస్తోందన్నమాట.

2018 చివరి నాటికి పూర్తవ్వాల్సిన పోలవరం ప్రాజెక్టు, 2021 జూన్ నాటికి గడువు పెంచుకుంది.. అదీ వైఎస్ జగన్ హయాంలో. టీడీపీ పాలన.. గతించిన చరిత్ర. వైసీపీ పాలన నడుస్తున్న చరిత్ర. మరి, వైసీపీ ఎందుకు బాధ్యతాయుతంగా వ్యవహరించలేకపోతోంది.? కేంద్రాన్ని ఎందుకు నిలదీయలేకపోతోంది.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.

పార్లమెంటు సమావేశాల్లో కేంద్రాన్ని కడిగి పారేస్తామన్నారు వైసీపీ ఎంపీలు, పోలవరం ప్రాజెక్టు విషయంలో. ఏదీ ఎక్కడ.? డిసెంబర్ నాటికి కూడా పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదంటే, అసలు జగన్ హయాంలో ఈ ప్రాజెక్టు పూర్తవుతుందా.? లేదా.? అన్న అనుమానాలు తలెత్తడం సహజమే. పోలవరం ప్రాజెక్టు పాపం ఏ ఒక్కరిదో కాదు.. ఇది అందరూ సమానంగా పంచుకోవాల్సిన పాపం.