కరోనా కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం కరోనా వైద్యం, టెస్టులకొరకు ప్రయివేట్ ఆసుపత్రులకు అనుమతులిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అపోలో, కేర్ సహా పలు ఆసుపత్రుల్లో ఇప్పుడు కొవిడ్ వైద్యం జరుగుతోంది. అయితే అదును చూసిన ప్రయివేట్ ఆసుపత్రులు కరోనా పేరిట దందా మొదలుపెట్టినట్లే తెలుస్తోంది. ఇటీవలే గచ్చిబౌలి కేర్ ఆసుపత్రిలో ఒకరు నీరసంగా కారణంగా ఆసుపత్రిలో జాయిన్ అయితే రెండు రోజుల అనంతరం కరోనా పరీక్షలు చేసి పాజిటివ్ గా నిర్ధారించారు. అప్పటి నుంచి ఆ వ్యక్తికి కొవిడ్ వైద్యం అందిస్తున్నారు. చివరిగా ఆ వైద్యం అందించిన డాక్టర్లు ప్రాణాన్ని నిలబెట్టలేకపోయారు.ఆసుపత్రిలో ఉన్న పది రోజులకు గాను అక్షరాల ఏడు లక్షల రూపాయల బిల్లు వేసారు. అందులో నాలుగు లక్షలు ఇన్సురెన్స్ క్లైమ్ చేసుకుంటామని..మిగిలి మూడు లక్షలు చెల్లించి బాడీని తీసుకెళ్లాలని సూచించారు.
దీంతో బాధిత కుటుంబ సభ్యులకు దిమ్మ తిరిగిపోయింది. సాధారణ జ్వరానికి ఇచ్చిన ట్రీట్ మెంట్ నే కొవిడ్ కి అందించారు కదా? అని ప్రశ్నిస్తే అతనికి పాత రోగాలు ఉన్నాయి. వాటికి చికిత్స చేసామంటూ ఠాగూర్ సినిమా సీన్ ని చూపించారు. మూడు లక్షలు కడితే బాడీ ఇస్తాం..లేకపోతే ఇవ్వం…దిక్కున్న చోట చెప్పుకోండని ఆసుపత్రి సిబ్బంది బెదిరింపులకు దిగింది. దీంతో బాధిత కుటుంబం మీడియాను ఆశ్రయించింది. విషయం పెద్ద ఎత్తున సోషల్ మీడియా, న్యూస్ ఛానల్ లో ప్రసారమైంది. ఈనేపథ్యంలో కరోనా పేరు చెప్పి కేర్ ఆసుపత్రి ఎలాంటి దందాలకు పాల్పడుతుందో కళ్లకు కట్టినట్లు అయింది. ఇలాంటి పరిస్థితిని ముందే ఊహించారు. ఇప్పుడదే జరుగుతోంది.
దీనిపై తక్షణం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రయివేటు వైద్యానికి సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేయాలి. ఇలాంటి ఆసుపత్రిలో కొవిడ్ తో జాయిన్ అయితే ప్రభుత్వానికి సంబంధించి ఓ ఉన్నత అధికారిని ఆసుపత్రికి కేటాయించాలి. ఎప్పటికప్పుడు అన్ని వివరాలు ఆ అధికారి చెపట్టాలి. అప్పుడే కొవిడ్ రోగులకు న్యాయం జరుగుతుంది. లేదంటే పేదల రక్తాన్ని కార్పోరేట్ ఆసుపత్రులు జలగల్లా పీల్చేయడం ఖాయం. ఈ ఘటనకు సంబంధించి సీఎం కేసీఆర్ గానీ, మంత్రి కేటీఆర్ గానీ ఇప్పటివరకూ స్పందించలేదు. ఆ ఇద్దరు తక్షణం స్పందించి ప్రయివేటు ఆసుపత్రుల చర్యలపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు సహా ప్రజలంతా కోరుతున్నారు.ఇక ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ నేతలు కేసీఆర్ తీరుపై మండిపడుతున్నారు. కరోనా భయంతో గజ్వేల్ లో దాక్కున్న కేసీఆర్ వెంటనే సిటీకి వచ్చి ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.