ప్లీనరీ ద్వారా వైసీపీ, రాష్ట్రపజలకు ఇచ్చిన సందేశమేంటి.?

ప్లీనరీ అనేది పార్టీకి సంబంధించిన వ్యవహారం. ప్లీనరీ వేదికగా పార్టీ పరమైన నిర్ణయాలు మామూలే. పనిలో పనిగా రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలూ సర్వసాధారణమే. అంగరంగ వైభవంగా ప్లీనరీ నిర్వహించామని చెప్పుకుంటున్న వైసీపీ, అసలు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన సంకేతమేంటి.?

ప్రజల కష్టాలనే పునాదులపై వైసీపీ బలంగా నిర్మితమైందని వైఎస్ జగన్ చెప్పుకున్నారు. ఇంతకీ, ప్రజల కష్టాలు తీరాయా.? లేదా.? ఈ ప్రశ్నకైతే వైసీపీ వద్ద సమాధానం లేదు. ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించి అత్యంత కీలకమైన అంశాలైన ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు.. వీటి గురించిన సరైన ప్రస్తావనే లేకుండా పోయింది ప్లీనరీ వేదికగా.

టీడీపీ, టీడీపీ అనుకూల మీడియా, దుష్టచతుష్టయం, దత్త పుత్రుడు.. ఈ పేర్ల ప్రస్తావన మాత్రం ప్లీనరీలో చాలా ఎక్కువగా కనిపించింది. ఎంత ఎక్కువగా అంటే, సొంత పార్టీ పేరుని కూడా చాలా తక్కువగా ఉచ్ఛరించిన వైసీపీ నేతలు, (అధినేత వైఎస్ జగన్ సహా..), పైన పేర్కొన్న పేర్ల ప్రస్తావన పట్ల అమితాసక్తి చూపించారు.

విమర్శల సంగతి పక్కన పెడితే, చంద్రబాబు సహా టీడీపీ అనుకూల మీడియాకి వైసీపీ ప్లీనరీ ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చినట్లయ్యింది. అసలు ఏపీలో టీడీపీ పరిస్థితేంటి.? టీడీపీకి వైసీపీ ఇచ్చిన ప్రాధాన్యత ఏంటి.? ప్లీనరీ ముగిశాక వైసీపీలోనే అంతర్గతంగా జరుగుతున్న చర్చ ఇది.

‘దీనికోసమేనా మనం ప్లీనరీ నిర్వహించుకున్నాం.?’ అంటూ వైసీపీలోనే అంతర్గతంగా నేతలు అసహనం వ్యక్తం చేసే పరిస్థితి వచ్చిందంటే, ప్లీనరీ హిట్టయినట్లా.? ఫ్లాపయినట్లా.?