విశాఖపట్నంకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ హోదా మూన్నాళ్ళ ముచ్చటే అయిపోయింది. కర్నూలు న్యాయ రాజధానిగా ప్రకటితమైనప్పటికీ, ఆ కర్నూలుపై పెద్దగా ఎవరికీ అంచనాల్లేవు. కానీ, విశాఖ విషయంలో అలా కాదు. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనగానే రియల్ భూమ్ జోరందుకుంది. విశాఖ వైపు దేశమంతా చూసింది.
కానీ, ఇప్పుడు సీన్ మారింది. మూడు రాజధానుల చట్టాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం ఉపసంహరించుకోవడంతో, విశాఖ భవిష్యత్తేంటన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. అయితే, విశాఖ గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే, విశాఖకి ఎప్పుడూ ఓ ప్రత్యేకత వుంది. విశాఖను ఎవరు అభివృద్ధి చేసినా, చెయ్యకపోయినా.. అది తనంతట తాను అభివృద్ధి చెందుతూనే వుంది.
విశాఖపై హుద్ హుద్ లాంటి తుపాను వచ్చి పడినా, ఎన్ని రాజకీయ తుపాన్లు వచ్చినా.. విశాఖ తన ప్రత్యేకతను కాపాడుకుంటూనే వుంది. విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వచ్చినా, రాకున్నా.. రాష్ట్రంలో అతి పెద్ద నగరం అదే. హైద్రాబాద్ తర్వాత ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోనూ ఆ స్థాయి వున్న నగరం విశాఖపట్నం.
సో, విశాఖపట్నంకి కొత్తగా వచ్చే కష్టమేమీ లేదు. రాజధాని అవకపోయినా, విశాఖ తనదైన ప్రత్యేకతను చాటుకుంటూనే వుంటుంది. కాకపోతే, అధికారంలో ఎవరున్నా విశాఖ వైపు కాస్త ప్రత్యేక దృష్టిపెడితే చాలు, అంతర్జాతీయ నగరమవడం చాలా చాలా తేలిక.
అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని.. అన్నట్లుంటుంది విశాఖ పరిస్థితి. విశాఖపట్నం వేదికగా సాఫ్ట్‌వేర్ రంగాన్ని అభివృద్ధి చేసి వుంటే.. ఈపాటికే విశాఖ ఐటీ సిటీ అయి వుండేది. విశాఖ గురించి తాజాగా అసెంబ్లీలో వైఎస్ జగన్ ప్రత్యేకంగా ప్రస్తావించిన దరిమిలా, మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకున్నా, విశాఖపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టబోతోందన్న విషయమైతే స్పష్టమవుతోంది. అదెలాగన్నది ముందు ముందు తేలుతుంది.