దేశంలో కరోనా ఉగ్ర రూపం చూపిస్తోంది. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత భారీగా కేసులు పెరిగిపోయాయి. ప్రస్తుతం ప్రపంచంలో కేసుల సంఖ్యలో భారత్ మూడవ స్థానంలో కొనసాగుతోంది. మొదటి స్థానంలో అగ్రరాజ్యం అమెరికా ఉంది. అక్కడ కేసులు 35 లక్షలు దాటిపోయాయి. ఆ తర్వాత రెండవ స్థానంలో బ్రెజిల్ ఉంది. 20 లక్షలు దాటినట్లు అంచనా. ఇక ఆ తర్వాతి స్థానం ఇండియాదే. 11 లక్షలు పైగానే కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య భారీగానే ఉంది. ప్రస్తుతం దేశంలో అన్ని రాష్ర్టాల్లో భారీ ఎత్తున పాజిటివ్ కేసులు నమోదువుతున్నాయి. మహరాష్ర్ట, ఢిల్లీ, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ర్టాలలో భారీ ఎత్తున కేసులు నమోదువుతున్నాయి.
ఇప్పటివరకూ ప్రభుత్వాలు కూడా పటిష్టంగా చర్యలు తీసుకున్నప్పటికీ ఇక ఆ పరిస్థితి కూడా దాటి పోయినట్లేననే అనుమానా లు వ్యక్తం అవుతున్నాయి. పెరుగుతోన్న కేసులను బట్టి నివేదకలు ఈ రకంగా హెచ్చరిస్తున్నాయి. తెలంగాణ రాష్ర్టంలో ఇప్పటికే సమూహ వ్యాప్తి మొదలైందని వచ్చే రెండు మూడు నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు. పోలీసు లు..డాక్టర్లు..ప్రభుత్వాల చేతులు దాటిపోతున్న పరిస్థితులని హెచ్చరిస్తున్నారు. ఎక్కువగా కేసులు నమోదవుతుంటే! ఎంత మంది డాక్టర్లను ప్రభుత్వం రిక్రూట్ చేసినా వైద్యం అందే పరిస్థితి ఉండదని…ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని చెబుతున్నారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితి లో ఇలాగే కొనసాగితే సెప్టెంబర్-అక్టోబర్ నెలఖరకు ఒక్క ఇండియాలోనే కోటికిపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి. ఈ పరిస్థితికి చేరుకుంటే! దేశం ఏమైపోద్దో కూడా చెప్పలేమని హెచ్చరిస్తున్నారు. ఈ స్థాయిలో కేసులు నమోదవ్వకుండా ఎన్ని చర్యలు తీసుకున్నా 50 లక్షలకు పైగా కేసులైతే సునాయాసంగా నమోదవుతాయని అంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం మళ్లీ లాక్ డౌన్ దిశగా ఆలోచన చేసే అవకాశం ఉందా? అంటే ఉందనే తెలుస్తోంది. ఈనెల 27న మళ్లీ ప్రధాని మోదీ అన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ లో సమావేశం అవుతున్నారు. ప్రధానంగా ఈ సమావేశం లాక్ డౌన్ గురించే నని నిపుణులు అంచనా వేస్తున్నారు.