Blood Donation: రక్తదానం చేయటం వల్ల ఇతరుల ప్రాణాలను కాపాడటం కాకుండా మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తం దానం చేయడం ద్వారా వారి ప్రాణాలను కాపాడవచ్చు. రక్తదానం చేయడం వల్ల ప్రాణాలను రక్షించవచ్చు .. కానీ మన ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుకోవచ్చు అనే సందేహం అందరిలో ఉంటుంది. రక్తదానం చేయటం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
రక్తదానం చేయటానికి సిద్ధపడిన వారికి హాస్పిటల్లో రక్త పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షల ద్వారా పల్స్ రేట్, హిమోగ్లోబిన్, బిపి ,షుగర్ వంటి అన్ని పరీక్షలు నిర్వహించి మన ఆరోగ్య పరిస్థితి సక్రమంగా ఉన్నప్పుడు ఇతరులకు రక్తం దానం చేయడానికి అవకాశం ఉంటుంది. మన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో రక్తదానం చేయటం వల్ల మనకు తెలుస్తుంది.
రక్తదానం చేయటం వల్ల రక్తంలోని ఐరన్ కంటెంట్ సమతుల్యంగా ఉంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రక్తంలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల గుండె సంబంధిత వ్యాధులు తలెత్తే ప్రమాదం ఉంది. కార్డియో వాస్కులర్ వంటి వ్యాధులను నిర్మూలించడానికి కూడా రక్తదానం చేయడం శ్రేయస్కరం.
రక్తదానం చేయడం ద్వారా క్యాన్సర్ సమస్యలు కూడా దరిచేరకుండా ఉంటాయి. శరీరంలో ఐరన్ కంటెంట్ తక్కువగా ఉండటం వల్ల క్యాన్సర్ లక్షణాలు తగ్గుతాయి. రక్తదానం చేయటం వల్ల బిపి సమస్య కూడా తగ్గుతుంది. తద్వారా గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు.
మనం తిన్న ఆహారం రక్తంలో కలిసిపోయి కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. అప్పుడప్పుడు రక్తదానం చేయడం వల్ల శరీరంలోని రక్త కణాల్లో కొలెస్ట్రాల్ శాతం తగ్గి శరీర బరువును నియంత్రిస్తుంది. రక్తదానం చేసి ఇతరుల ప్రాణాలు వాడటం వల్ల మన ఆరోగ్యం కూడా బాగుంటుంది.