ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటు వేస్తే డబ్బులు ఇస్తామంటూ బహిరంగ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం..రెండు రోజుల క్రితం వైరాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాములు నాయక్..ఓటర్లకు డబ్బులు పంచాలని బహిరంగంగానే నేతలకు సూచించారు.
ఆఫ్ ద రికార్డ్ గా చెబుతున్నా..’ఓటు వేస్తే డబ్బులు ఇస్తాం’ ఇందులో భయపడాల్సిన పనేం లేదని పేర్కొన్నారు. ఓటర్లను ఏ, బీ, సీ, డీ గా విభజించండి. వారిలో ఓటు వేయరనుకునే వాళ్లను, అనుమానం ఉన్నవాళ్లను గుర్తించండి. వారికి డబ్బులు పంపిణీ చేయాలని కార్యకర్తలకు సూచించారు. ప్రస్తుతం రాములు నాయక్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్‌హల్‌గా మారాయి.డబ్బుతో ఓటర్లను మభ్య పెడుతున్నారంటూ ఎమ్మెల్యే రాములు నాయక్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా రేపు ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలీంగ్ జరగనుంది.
ఖమ్మం జిల్లా వైరాకు చెందిన ఎమ్మెల్యే రాములు నాయక్ గతంలో స్వతంత్ర అభ్యర్థిగా కాంగ్రెస్ రెబల్ గా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరిపోయారు. మొత్తం మీద రాములు నాయక్ బహిరంగంగానే భయం లేకుండా డబ్బు పంపిణీ చేద్దామని చెప్పడం వైరల్ గా మారింది. ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఎన్నికల సమయంలో అధికార పార్టీకి కొత్త టెన్షన్ తెచ్చిపెట్టాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా సిట్టింగ్ సీటును నిలుపుకోవడానికి అధికార పార్టీ ప్రయత్నాలు చేస్తోంది.