తెలంగాణ, ఆంధ్రపదేశ్ మధ్య నీటి యుద్ధం: పొలిటికల్ షో మాత్రమేనా.?

Water Fight Between AP & TS, A Political Show!
Water Fight Between AP & TS, A Political Show!
తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలపై మాటల తూటాలు పేలుతున్నాయి. పంపకాలు చెరిసగం వుండాలంటోంది కృష్ణా నది నీటికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం.
 
అదెలా కుదురుతుంది.? గతంలో ఏ లెక్కన అయితే పంపకాలు జరిగాయో, అదే లెక్కన పంపకాలు జరగాలన్నది ఆంధ్రప్రదేశ్ వాదన. ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాల్ని పట్టించుకోకుండా తెలంగాణ ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతోంది. ఆంధ్రప్రదేశ్ మాత్రం, కేంద్రానికి ఫిర్యాదులు చేసుకుంటూ కూర్చుంది.
 
నిజానికి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో జలదీక్ష చేపట్టినట్లగా ఇప్పుడు అంతకన్నా పెద్ద ఉద్యమం చేయాల్సినంత సీరియస్ ఇష్యూ ఇది. కానీ, అప్పుడాయన ప్రతిపక్ష నేత. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి. దాంతో, లేఖలతో సరిపెడుతున్నారన్న విమర్శలున్నాయి. కాగా, అసలు ఇది వివాదమే కాదంటున్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. తెలంగాణ అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని సెలవిచ్చారు.
 
తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చ పెట్టడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారంటూ అనవసరంగా చంద్రబాబు ప్రస్తావన తెస్తున్నారు. రాజకీయంగా చంద్రబాబుని విమర్శించేందుకు అధికార పార్టీ దగ్గర చాలా విషయాలే వుంటాయి. ఈ నీటి పంపకాల వైఫల్యానికి మాత్రం వైఎస్ జగన్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఎందుకంటే, తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాటాగా దక్కాల్సిన నీళ్ళలో చాలా నీళ్ళను వాడేసుకుంది.. విద్యుదుత్పత్తి ద్వారా.
 
ఎగువన భారీ వర్షాలు కురిసి, ప్రాజెక్టులు నిండకపోతే, ఇప్పుడు కోల్పోయిన నీరు అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారుతుంది మరి. కాగా, ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి అయితే, అసలు కేసీయార్, జగన మధ్య విభేదాల్లేవంటున్నారు. ఇద్దరి మధ్యా సఖ్యత వుందని సెలవిస్తున్నారు. మంచిదే.. ఆ సఖ్యతను ఎవరు కాదనగలరు. ఇది నీటి సమస్య. ఈ ఇద్దరి సఖ్యత రాష్ట్రానికి శాపంగా మారితే ఎలా.?