రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ఓ చోట కూర్చుని చర్చించుకుంటే పరిష్కారమయ్యే సమస్యను కావాలనే పెంచి పోషిస్తున్నారని సాక్షాత్తూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల వ్యాఖ్యానించడాన్ని ఇక్కడ ప్రస్తావించుకోవాలి. తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టిన షర్మిల, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద కేవలం రాజకీయ విమర్శలు చేశారని అనలేం. ఆమె ఉద్దేశ్యం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ మీద విమర్శలు చేయడమే. ఎందుకంటే, తెలంగాణలో అధికారంలోకి రావాలని షర్మిల అనుకుంటున్నారు. అయితే, ఇది కేసీయార్ సమస్య కాదు.. వైఎస్ జగన్ సమస్య కాదు.. షర్మిల సమస్య.. ఇంకో నాయకుడి సమస్య కాదు.. ఇది పూర్తిగా రెండు తెలుగు రాష్ట్రాల సమస్య. కృష్ణా జలాల వివాదం విషయమై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులు ఒక్క చోట కూర్చుని చర్చించుకుంటే, సమస్యను పరిష్కరించడం పెద్ద విషయమేమీ కాదు కదా.? కానీ, అలా చెయ్యలేదు. కారణం ఏమై వుంటుందన్న విషయాన్ని పక్కన పెడితే, వివాదం ముదిరి పాకాన పడింది.
కేంద్రం రంగంలోకి దిగి, గెజిట్ కూడా జారీ చేసింది. కృష్ణా నదితోపాటు, గోదావరి నదికి సంబంధించి రివర్ మేనేజ్మెంట్ బోర్డుల్ని ఏర్పాటు చేసింది. ఆ బోర్డులకు అధికారాలు కట్టబెట్టింది కేంద్రం. ఇప్పడిక ఏ పంచాయితీ అయినా, ఆ బోర్డుల వద్దనే తేల్చుకోవాలి. ఏపీ ఓ లేఖ రాస్తే, దానికి ప్రతిగా తెలంగాణ ఇంకో లేఖ రాస్తోంది. ఆ ప్రాజెక్టు ఆపమని తెలంగాణ, ఈ ప్రాజెక్టు ఆపమని ఆంధ్రప్రదేశ్.. ఇలా పరస్పర ఫిర్యాదులు చేసుకోవడంతోనే సరిపోతోంది. తాజాగా విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రాజెక్టుల నుంచి నీటిని వాడేస్తున్నారంటూ తెలంగాణపై ఫిర్యాదు చేసింది ఆంధ్రప్రదేశ్. రేప్పొద్దున్న తెలంగాణ నుంచి ఇంకో కోణంలో పిర్యాదు కృష్ణా బోర్డుకి వెళ్ళినా వింతేమీ వుండదు. ఇంతకీ, ఈ లేఖలన్నీ ఏమవుతున్నాయి.? అట్నుంచి స్పందనలైతే వస్తున్నాయి కొన్ని లేఖలకు సంబంధించి, కానీ ఇక్కడ మాత్రం ఎలాంటి ప్రయోజనం వుండడంలేదు.