Narreddy Rajasekhar Reddy : వైఎస్ వివేకానందరెడ్డి హత్య చుట్టూ మళ్ళీ రాజకీయ రచ్చ తారాస్థాయికి చేరింది. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి చుట్టూ రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి.. ఈ హత్యకు కేంద్ర బిందువు ఆయనేనన్న ఆరోపణలతో. అవినాష్ రెడ్డి చుట్టూ జరుగుతున్నది కేవలం దుష్ప్రచారమేనని వైసీపీ అంటోంది.
కాగా, వైసీపీ తాజాగా నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డిపైన అనుమానాలు షురూ చేసింది. నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి స్వయానా వైఎస్ వివేకాందరెడ్డికి అల్లుడు. ఆస్తి కోసమే నర్రెడ్డి, వివేకానందరెడ్డిని చంపేశారన్నది వైసీపీ ఆరోపణ. కాదు కాదు, నర్రెడ్డి ద్వారా వైఎస్ వివేకానందరెడ్డిని చంద్రబాబే చంపించారని వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపిస్తున్నారు.
కాగా, తన భర్తపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారం నేపథ్యంలో వైఎస్ వివేకా కుమార్తె సునీతా రెడ్డి అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేసు తప్పుదోవ పట్టించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారన్నది ఆమె ఆరోపణ.
సునీతా రెడ్డి, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి సహా పలువురు ఇప్పటికే వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసుకు సంబంధించి విచారణ చేస్తోన్న సీబీఐకి వాంగ్మూలాలు ఇచ్చిన విషయం విదితమే. ఆ వాంగ్మూలాల్లో రోజుకొకటి చొప్పున వెలుగు చూస్తుండడంతో అధికార వైసీపీ ఒకింత ఉలిక్కపడుతోంది.
నిజానికి, వైసీపీ ఇక్కడ భుజాలు తడుముకోవడానికి ఏమీ లేదు. కానీ, తడుముకుంటోందంటే కారణమేంటి.? అన్న చర్చ సహజంగానే తెరపైకొస్తుంటుంది. నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి ద్వారా చంద్రబాబునాయుడే వైఎస్ వివేకానందరెడ్డిని చంపించి వుంటే, అధికారంలోకి వస్తూనే.. ఆ ఇద్దరి అరెస్టు దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చర్యలు తీసుకునేవారే.
ఏదిఏమైనా, వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి వివేకా అల్లుడు, వివేకా కుమార్తెల పేర్లు తెరపైకి తీసుకురావడం వైసీపీకే ఇబ్బందికరం.. అది రాజకీయంగా అయినా, మరో రకంగా అయినా.!