వార్మప్ మ్యాచ్ సరే.. జనసేన అసలు మ్యాచ్ ఆడేదెప్పుడు.?

Nadendla throws Silly Comment

Nadendla throws Silly Comment

2014 ఎన్నికల్లో అసలు పోటీ చేయనే లేదు.. 2019 ఎన్నికల్లో పోటీ చేసినా, చిన్నా చితకా పార్టీలతో కలిసి ఎన్నికల బరిలోకి దిగడం జనసేనను దారుణంగా దెబ్బ తీసింది. ప్రస్తుత మిత్రపక్షం బీజేపీ, పాత మిత్రపక్షం టీడీపీ.. రెండూ కలిసి, 2019 ఎన్నికల్లో జనసేనను ఏ స్థాయిలో దెబ్బ కొట్టాయో అందరం చూశాం. ఇంత జరిగినా, జనసేన రాజకీయ వ్యూహాల్లో పరిపక్వత కనిపించడంలేదు. పంచాయితీ ఎన్నికల్లో ప్రభావం చూపి, మునిసిపల్ ఎన్నికలొచ్చేసరికి చేతులెత్తేసింది జనసేన. ఇక, తిరుపతి ఉప ఎన్నిక విషయంలో అయినా బీజేపీ – జనసేన మధ్య కింది స్థాయిలో సఖ్యత కనిపిస్తోందా.? అంటే అదీ లేదు. జనసేన నుంచి వచ్చే ఓట్లు తమకు కావాలి తప్ప, జనసేనానికి సముచిత గౌరవం ఇవ్వాలనీ, జనసేన నేతలతో పూర్తిస్థాయిలో కలిసి పనిచేయాలన్న ఆలోచన బీజేపీలో కనిపించడంలేదు.

ఇదిలా వుంటే, తిరుపతి ఉప ఎన్నికని వార్మప్ మ్యాచ్.. అని అభివర్ణించారు జనసేన నేత నాదెండ్ల మనోహర్. రాజకీయాల్లో ఇలాంటి పదాల ప్రస్తావన అస్సలేమాత్రం బాగోదు. ప్రజల మెప్పు పొందడం, తద్వారా రాజకీయంగా బలపడటం.. ఇదీ రాజకీయాల్లో చేయాల్సింది. తిరుపతి ఉప ఎన్నికలో తమకంటే తక్కువ బలం వున్న పార్టీకి అవకాశమిచ్చి, పోటీ చేయకుండా తామూ దూరమైపోవడాన్ని జనసేన ఎలా సమర్థించుకోగలుగుతుంది.? బీజేపీ గనుక డిపాజిట్లు తెచ్చుకోకపోయినా, నోటా కంటే ఆ పార్టీ అభ్యర్థికి తక్కువ ఓట్లు వచ్చినా.. కమలదళానికి కొత్తగా వచ్చే నష్టమేమీ లేదు. కానీ, జనసేన మాత్రం రాజకీయంగా అత్యంత తీవ్రమైన నష్టాన్ని చవిచూస్తుంది. ఒకవేళ బీజేపీ చెప్పుకోదగ్గ స్థాయిలో రాణిస్తే, ఆ ఘనత తమదేనని కమలనాథులు చెప్పుకుంటారు తప్ప, జనసేనకు క్రెడిట్ ఇచ్చే అవకాశమే వుండదు. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలతో సమదూరం పాటిస్తూ, వ్యూహాత్మకమైన రాజకీయాలు చెయ్యనంతకాలం జనసేన అనే పార్టీ.. ‘ఆటలో అరటిపండు’ మాత్రమే.!