రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో నాలుగు స్థానాలు వైకాపా సొంతం

నేడు (శుక్ర‌వారం) జ‌రిగిన‌ రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో నాలుగు స్థానాల్లో వైకాపా విజ‌యం త‌ధ్యం అని అనుకున్న‌ట్లుగానే జ‌రిగింది. నాలుగు స్థానాల్లోనూ అధికార పార్టీ స‌త్తా చాటింది. వైకాపా నుంచి పోటీకి దిగిన నులుగురు విజ‌యం సాధించారు. పిల్లి సుభాష్ చంద్ర‌బోస్, మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌, ఆళ్ల అయోధ్య‌రామిరెడ్డి, ప‌రిమ‌ళ్ న‌త్వానీ రాజ్య‌స‌భ స‌భ్యులుగా ఎన్నిక‌య్యారు. దీంతో రాజ్య‌స‌భ‌లో వైకాపా బ‌లం 6కు చేరుకుంది. ఇక టీడీపీ నుంచి పోటీ చేసిన వ‌ర్ల రామ‌య్య ఓట‌మి పాల‌య్యారు.

మొత్త 173 మంది ఎమ్మెల్యేలు ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. వైకాపాకు చెందిన 151 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ స‌భ్యుల‌కే ఓటు వేసారు. జ‌న‌సేన ఎమ్మెల్యే రాపాక వ‌ర‌ప్ర‌సాద్ క‌డా వైకాపాకే ఓటేసారు. దీంతో న‌లుగురు వైకాపా అభ్య‌ర్ధుల‌కు 38 చొప్పున ప్రాధాన్య‌త ఓట్లు ద‌క్కాయి. వ‌ర్ల రామ‌య్య‌కు 17 ఓట్లు ప‌డ్డాయి. టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్ వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల ఓటు హ‌క్కు వినియోగించుకోలేక‌పోయారు. ఇంకా తెదాపాకు చెందిన ఆదిరెడ్డి భ‌వానీ, బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి, వ‌ల్ల‌భ‌నేని వంశీ, మ‌ద్దాళి గిరిధ‌ర్ ఓట్లు చెల్ల‌న‌విగా గుర్తించారు.