బల ప్రదర్శన సరిపోదు, జన ప్రదర్శన కావాలి జనసేనానీ.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘సింగిల్ డే’ షో అదిరిపోయింది. కొంత చప్పగానూ, ఒకింత ఘాటుగానూ పవన్ కళ్యాణ్ ప్రసంగాలు తూర్పుగోదావరి జిల్లాలో అలాగే అనంతపురం జిల్లాలో జరిగాయి. వేలాదిమంది యువకులు పవన్ కళ్యాణ్ వెంట కనిపించారు. గతానికి భిన్నంగా మధ్య వయస్కులు, వయసు మళ్ళినవారు కూడా ఈసారి పవన్ వెంట కొంత మేర బాగానే వున్నట్లు తెలుస్తోంది.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బల ప్రదర్శన విషయంలో ఎవరూ ఎలాంటి విపరీత వ్యాఖ్యలు చేయాల్సిన పనిలేదు. సినీ నటుడిగా అతనికున్న ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. అయితే, బల ప్రదర్శన వేరు.. జన ప్రదర్శన వేరు. 2019 ఎన్నికలకు ముందు కూడా పవన్ కళ్యాణ్ వెంట పెద్దయెత్తున జనం కనిపించారు. కానీ, అలా కనిపించినవారిలో పావు వంతు కూడా పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనకు 2019 ఎన్నికల్లో ఓట్లేయలేదు. ‘పవనన్నకు ప్రాణమిస్తాం.. జగనన్నకి ఓటేస్తాం..’ అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులే చాలా చోట్ల బ్యానర్లు కట్టుకున్న పరిస్థితిని గతంలో చూశాం.

సినిమా వేరు, రాజకీయం వేరు. రాజకీయాల్లో నాయకత్వ లక్షణాలు అవసరం. ప్రజల్ని మెప్పించాలి, వాళ్ళని ఆకట్టుకోవాలి ప్రసంగాల ద్వారా. ఆవేశం అవసరమే, కానీ అది ఎక్కడ వాడాలో అక్కడ వాడాలి. ‘ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పోడు..’ అన్నది రాజకీయాలకూ వర్తిస్తుందని పవన్ కళ్యాణ్ ఎప్పుడు తెలుసుకుంటారో ఏమో.

మంగళగిరి పార్టీ కార్యాలయంలో ప్రసంగించినప్పుడు వున్న సమయం, జనంలోకి వెళ్ళేసరికి కోల్పోయారు పవన్ కళ్యాణ్. అదే ఆయన బలం, అదే ఆయన బలహీనత కూడా. ‘పవర్ లేనప్పుడు పవర్ స్టార్ అనే పేరెందుకు.. ముఖ్యమంత్రి పదవి వచ్చాక సీఎం పవన్ కళ్యాణ్ అని పిలవడం.. అప్పటిదాకా వద్దు..’ అని పవన్ స్వయంగా చెప్పుకోవాల్సి వచ్చిందంటే అభిమానుల అతి, ఆయన్ని ఎంతలా చికాకు పెడుతుందో అర్థం చేసుకోవచ్చు. గతంతో పోల్చితే పవన్ చాలావరకు మారారు కానీ, ఇంకా ఆయన మారాలి. మారితే, రాజకీయంగానూ ఆయన దశ మారుతుంది. లేదంటే అంతే.