అదిగదిగో విజయదశమి.. అప్పటికల్లా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పనులు షురూ అవుతాయ్.. పరిపాలన విశాఖ నుంచే సాగుతుంది.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖ నుంచే పాలన చేస్తారు. ఈ మేరకు క్యాంపు కార్యాలయం కోసం సర్వం సన్నద్ధమవుతోంది.. ముఖ్యమైన కార్యాలయాల కోసం కొన్ని భవనాలు దాదాపుగా ఖరారయ్యాయి.. అంటూ కొన్నాళ్ళుగా ప్రచారం జరుగుతూ వచ్చింది. కానీ, విజయదశమి వచ్చేస్తున్నా.. విశాఖ నుంచి పాలన దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోలేకపోతోంది. రాష్ట్రానికి మూడు రాజధానుల దిశగా వైఎస్ జగన్ ప్రభుత్వం, అసెంబ్లీలో తీర్మానం చేసింది. అయితే, ఆ తీర్మానం ఆమోదం పొందే క్రమంలో చాలా అలజడి రేగింది.. అది చివరికి శాసన మండలి రద్దు తీర్మానం దాకా వెళ్ళింది. మూడు రాజధానులపై చట్టం జరిగిపోయిందని ప్రభుత్వం చెబుతోంది.
అయితే, హైకోర్టు మాత్రం ‘స్టేటస్ కో’ ఆదేశాలు ఇచ్చింది. ‘న్యాయ వివాదాలు తొలగిపోయి, సానుకూల వాతావరణం ఏర్పడుతుందని భావిస్తున్నాం.. త్వరలోనే విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవుతుంది..’ అని పదే పదే ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. కానీ, రోజులు గడుస్తున్నాయ్.. నెలలు గడుస్తున్నాయ్.. విశాఖ మాత్రం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవడంలేదు. కర్నూలే కాస్త బెటర్.. ‘మమ’ అనిపించేసినట్టుగా, ఓ కార్యాలయాన్ని అక్కడ ఏర్పాటు చేసేసి.. ‘న్యాయ రాజధాని’ అనేసింది వైఎస్ జగన్ సర్కార్. హైకోర్టు తరలింపు జరిగితేనే కర్నూలు న్యాయ రాజధాని అవుతుందనుకోండి.. అది వేరే సంగతి. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ళు దాటేసింది. ఏకైక రాజధాని అమరావతి పనులు ముందుకు వెళ్ళలేదు.. ఆ వ్యవహారం వెనక్కి నడుస్తోంది. మూడు రాజధానుల్లో మిగతా రెండు రాజధానుల పరిస్థితి అతీ గతీ లేకుండా తయారైంది. ఇలా ఇంకెన్నాళ్ళు.? ఈ సాగతీత అధికార పార్టీకే రాజకీయంగా ముందు ముందు ఇబ్బందికరం కాబోతోంది.