వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయా రాజశేఖర్ రెడ్డి నిన్న విడుదల చేసిన బహిరంగ లేఖకు పెడార్థాలు తీస్తోంది ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ. మరీ ముఖ్యంగా వైఎస్ వివేకా హత్య విషయమై విజయమ్మ చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది తెలుగుదేశం పార్టీ. మాజీ మంత్రి ఆది నారాయణ రెడ్డి గురించి ప్రస్తావించిన విజయమ్మ, వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గురించి ఎందుకు మాట్లాడటంలేదంటూ టీడీపీ నేత పట్టాభి ప్రశ్నించారు. అయితే, వైఎస్సార్ కుటుంబమంతా ఒక్కతాటిపైనే వుందని చెప్పేందుకు వైఎస్ విజయమ్మ బహిరంగ లేఖ రాశారన్న విషయాన్ని విస్మరించలేం. ఇందులో వైఎస్ విజయమ్మ ప్రయత్నాన్ని తప్పుపట్టడం ఎంతవరకు సబబు.? అన్నదే చర్చ. వైఎస్ వివేకా హత్య, చంద్రబాబు హయాంలోనే జరిగింది. దానికి నైతిక బాధ్యత వహించాల్సింది టీడీపీనే.
మరోపక్క, ప్రతిపక్ష నేత మీద జరిగిన హత్యాయత్నానికీ టీడీపీనే నైతిక బాధ్యత వహించాలి. తమ హయాంలో జరిగిన ఘటనలపై అప్పట్లో అధికార టీడీపీ ఎలా వ్యవహరించిందో చూశాం. అయితే, ఇక్కడ.. ఆయా కేసుల్లో నిజాలు నిగ్గు తేల్చాల్సిన బాధ్యత నైతికంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద వుంది. ఎందుకంటే, ఆయా కేసుల్లో టీడీపీపైనే వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. విజయమ్మ లేఖలోని అంశాలపై టీడీపీకి అభ్యంతరాలు వుండొచ్చుగాక. కానీ, గాంధారిగా అభివర్ణించడం.. అదీ ఓ మహిళను కించపర్చేలా వ్యవహరించడం టీడీపీ నేతలకు తగని పని. స్వర్గీయ నందమూరి తారకరామారావు ఎలా చనిపోయారు.? వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎలా చనిపోయారు.? వారి మరణాల వెనుక అసలు కారణాలేంటన్నది బహిరంగ రహస్యం. వైఎస్ వివేకా విషయంలో అయినా, కోడి కత్తి వ్యవహారం అయినా అంతే. ఈ కేసుల్లో నిజాలు నిగ్గు తేలడం అనేది సాధ్యమయ్యే పనే కాదు. వీటి చుట్టూ రాజకీయాలు అలా నడుస్తుంటాయంతే.