‘ఇంకొద్ది గంటలు మాత్రమే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి పదవిలో వుంటారు..’ అంటూ సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరిగింది నిన్నంతా. జగన్ బెయిల్ రద్దు పిటిషన్ మీద నేడే తీర్పు రాబోతోందన్న ప్రచారం నేపథ్యంలో ఇంత రచ్చా చేసేశారు వైఎస్ జగన్ వ్యతిరేకులు. కానీ, బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణను న్యాయస్థానం మరోమారు వాయిదా వేసింది. వైఎస్ జగన్ బెయిల్ రద్దు కోసం ఏ రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారో, ఆయనే.. విజయసాయిరెడ్డి బెయిల్ పిటిషన్ రద్దు చేయాలనీ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం విదితమే. రెండు పిటిషన్లపై తీర్పు ఒకేసారి ఇవ్వనున్నట్లు న్యాయస్థానం స్పష్టం చేసింది. దాంతో, వైఎస్ జగన్ వ్యతిరేకులంతా నీరసించిపోయారు. అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్ గతంలో అరెస్టవడం సుమారు 16 నెలలపాటు జైల్లో వుండడం తెలిసిన సంగతులే. ఆ తర్వాత ఆయన, ఆయనతోపాటు ఆరోపణలు ఎదుర్కొన్న విజయసాయిరెడ్డి సహా పలువురు బెయిల్ మీద విడుదలయ్యారు.
ప్రజా కోర్టులో వైఎస్ జగన్ సత్తా చాటారు. బంపర్ విక్టరీ సొంతం చేసుకున్నారు 2019 ఎన్నికల్లో. ఎలాగైనా ఆయన్ని ముఖ్యమంత్రి పదవి నుంచి కిందికి లాగెయ్యాలన్న కోణంలో ప్రత్యర్థులు రాజకీయ యెత్తుగడలు వేస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుని పావుగా వాడుకున్నారనే ఆరోపణలున్నాయి. సరే, న్యాయస్థానాల్లో తీర్పులు వాదోపవాదాల్లో బాలన్ని బట్టి, ఆయా అంశాల్లో నిజా నిజాల్ని బట్టి వస్తాయనుకోండి.. అది వేరే సంగతి. న్యాయస్థానాల తీర్పుల్ని తప్పు పట్టలేం. వాటిని పై కోర్టులో సవాల్ చేసుకునే అవకాశం ఎలాగూ వుంటుంది. కానీ, జగన్ బెయిల్ రద్దయిపోతే, ఆయన జైలుకెళ్ళిపోతే.. అంటూ ఎదురుచూస్తున్నవారికి తరచూ నిరాశే ఎదురవుతుండడం గమనార్హం. 2019 ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ భజన చేసిన రఘురామ, ఇప్పుడు వైఎస్ జగన్ మీద పనిగట్టుకుని చేస్తున్న దుష్ప్రచారం.. ఇంకెలాంటి పరిణామాలకు దారి తీస్తుందో వేచి చూడాల్సిందే.