ప్రకాశం జిల్లాకి చెందిన టీడీపీ ప్రజా ప్రతినిథులు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చేతకానితనం వల్లనే గెజిట్‌లో వెలిగొండ ప్రాజెక్టుకి గుర్తింపు లభించలేదన్నది సదరు టీడీపీ నేతల ఆరోపణ. వెలిగొండ ప్రాజెక్టుకి కేంద్రం నిధులు కేటాయించడాన్ని (కేటాయిస్తోందా.? లేదా.? అన్నది వేరే చర్చ) తెలంగాణ ప్రభుత్వం తప్పు పడుతూ, కేంద్రానికి లేఖ రాసిన విషయం విదితమే. ఈ వ్యవహారంపై ప్రకాశం తెలుగు తమ్ముళ్ళు స్పందించారు. నిజానికి, ఈ విషయమై టీడీపీ తొలుత రిప్రెజెంటేషన్ ఇవ్వాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. ఆ తర్వాత కేంద్రానికి ఈ అంశంపై ఫిర్యాదు చేయాలి. పొరుగునున్న తెలంగాణ రాష్ట్రం ఏం చేయగలుగుతుంది.? తెలంగాణ రాష్ట్రం తన ప్రయోజనాల నేపథ్యంలో స్పందిస్తోంది.
పైగా, నీళ్ళ పంచాయితీ షురూ అయ్యాక.. ఏపీని ఎలా ఇరకాటంలో పడేయాలా.? అన్నదానిపై పెద్ద రిసెర్చే చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అలాంటప్పుడు, తెలంగాణ ముఖ్యమంత్రికి లేఖ రాసి, తెలుగు తమ్ముళ్ళు ఏం సాధించాలనుకుంటున్నట్టు.? వెలిగొండ ప్రాజెక్టుకి రాజకీయ గ్రహణం పట్టి చాన్నాళ్ళే అయ్యింది. చంద్రబాబు హయాంలోనూ, అంతకు ముందూ ఆ ప్రాజెక్టు పట్ల పూర్తిస్థాయి నిర్లక్ష్యమే కనిపించింది. ఇప్పుడు జగన్ సర్కార్, ఈ ప్రాజెక్టు విషయాన్ని ఏం చేస్తుంది.? అన్నది చూడాల్సి వుంది. తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదుతో, వెలిగొండ ప్రాజెక్టు పనులు నిలిపివేసే పరిస్థితి వుంటుందని అనుకోలేం. కానీ, తెలంగాణ ఫిర్యాదుని అంత తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ వ్యవహారంపై ఒకింత సీరియస్‌గానే స్పందించాల్సి వుంది. కానీ, స్పందించడంలో కాస్త అలసత్వం కనిపిస్తున్నట్టే వుంది. అందుకేనేమో, టీడీపీ రంగంలోకి దూకింది. ఇక్కడ టీడీపీ ‘అతి’ కారణంగా ఒరిగేదేమీ వుండదు.. కాకపోతే, టీడీపీ పబ్లిసిటీ స్టంట్లు చేసుకోవడానికి ఓ అవకాశం దొరికిందంతే.